- సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) ఆశయాలను సాధిద్దామని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కోటగల్లీలోని ఎన్ఆర్ భవన్ లో రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ, భారత విప్లవోద్యమంలో 50 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి, అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిన ఘనత కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న)కు ఉందన్నారు. కామ్రేడ్ రవన్న సుదీర్ఘకాలం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడన్నారు. గోదావరి లోయ పరివాహాక ప్రాంతంలో లక్షలాది ఎకరాల పోడు భూములను గిరిజనులు, నిరుపేద గిరిజనేతరకు సాధించడంలో రవన్న పాత్ర క్రియాశీలకమైందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించడంలో కామ్రేడ్ రవన్న మార్గదర్శకత్వం అపూర్వమైందన్నారు. రష్యా తరహా పెట్టుబడిదారీ దేశంగా మన దేశముందని, భారతదేశంలో విప్లవం విజయవంతం కావాలంటే ఈ మారిన పరిస్థితి అనుగుణంగా పార్టీ కార్యక్రమం, పందా, నిబంధనావలిని మార్చుకోవాలని సిద్ధాంతికరించిన నాయకుడన్నారు. భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని ఆశించారని, తద్వారానే విప్లవం విజయవంతం అవుతుందని కామ్రేడ్ రవన్న సిద్ధాంతికరించారన్నారు. నేడు దేశంలో మనవాద, మతోన్మాద ఫాసిజం అత్యంత ప్రమాదంగా మారిన నేపథ్యంలో శ్రామిక, కష్టజీవుల సమైక్య, బలమైన ఉద్యమ నిర్మాణాలు అత్యంత ఆవశ్యకమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఎం.నరేందర్, డి. రాజేశ్వర్, డి.కిషన్, ఆల్గొట్ రవీందర్, జిల్లా కార్మిక నాయకులు బండారి లక్ష్మణ్,జి.శివకుమార్,కిరణ్ కుమార్,చరణ్,ఎస్.శివకుమార్,మాధవి, రవి కిరణ్, సిఎల్సి జిల్లా నాయకులు స్వామి, పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ తదితరులు పాల్గొన్నారు.