Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 6:47 pm Posted by : ramakrishna

అమరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేద్దాం

సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అమరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేద్దాం అని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ పిలుపునిచ్చారు.  భూమి కోసం భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, కార్మిక వర్గ హక్కుల కోసం, సామ్యవాద స్థాపన లక్ష్యంతో పోరాడి అసువులు బాసిన అమర వీరుల సంస్మరణ సభ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లీలోని శ్రామిక భవన్ లో గురువారం నిర్వహించారు. ఈ సభకు పార్టీ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమం త్యాగాలతో పునీతమైందన్నారు. వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటంలో, గోదావరి లోయ పోరాటంలో పీడిత ప్రజల విముక్తి కోసం ఎంతోమంది పోరాట యోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. ముఖ్యంగా ప్రజాపంథా కోసం జీవితాలను త్యాగంచేసి పోరాడిన కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్, డివి కృష్ణ, పోట్ల రామనరసయ్య, నీలం రామచంద్రయ్య, దొరన్న, లింగన్న, ఎల్లన్న, సావలం సాయిలన్న, జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, వేములపల్లి కిరణ్ కుమార్ లాంటి వారు ఎందరో అమరులయ్యారన్నారు. వారి త్యాగాల స్ఫూర్తితో ప్రజలను వర్గ పోరాటాలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మన దేశం పెట్టుబడిదారీ దేశంగా మారిందన్నారు. ప్రజా ఉద్యమాల మీద, ప్రజాస్వామిక హక్కుల మీద రాజ్యం దాడి చేస్తున్నదన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ఫాసిస్టు రూపం తీసుకున్నదన్నారు. మతాన్ని రెచ్చగొట్టి ఉన్మాదాన్ని చిమ్ముతున్నదన్నారు. మోడీ ప్రభుత్వ నియంతృత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి, పోరాటాల వైపు పయనింప చేయాలన్నారు. అదే అమరవీరులకు నిజమైన నివాళి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ సహాయ కార్యదర్శి సాయన్న, నగర కార్యదర్శి ఎం.సుధాకర్, సీఎల్సీ జిల్లా కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, మాస్ లైన్ జిల్లా నాయకులు డి.కిషన్, బి.మురళి, పీఓడబ్లు జిల్లా కార్యదర్శి సంధ్యారాణి, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి గణేష్, వివిధ ప్రజాసంఘాల నాయకులు నారాయణ, లలిత, లక్ష్మీ, సాయిబాబా, సుమలత, అమూల్య, లలిత
తదితరులు పాల్గొన్నారు.