. . . ఇప్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
అన్ని మతాలకు చెందినవారు కలిసికట్టుగా సోదర భావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రంజాన్ మాసం ఒక పండుగ మాత్రమే కాదని, విలువలను గుర్తుచేసే పవిత్ర మాసమని, నెల రోజుల పాటు ఆత్మశుద్ధితో పరులకు సహకారం అందిస్తూ అందరితో సత్సంబంధాలను కొనసాగించడమే రంజాన్ మాసం పవిత్రత అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలు, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కి మంత్రి పదవి, షబ్బీర్ అలీ కి సలహాదారుగా, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీగా ఉద్యోగం కల్పించడమే కాకుండా 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని, 8 మంది మైనారిటీ నాయకులను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ రంజాన్ పండుగ ప్రజల్లో సఖ్యత, సోదరభావం తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ మత సామరస్యంతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ప్రతి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనారిటీలకు సింహ భాగమిచ్చి ముందుకు నడిపిస్తున్నామని, ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లలో మైనారిటీలకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం మనందరిదని, నేను మీ సోదరుడిని అని, మనమందరం కలిసి తెలంగాణ, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. అందరం కలిసి కష్టపడితేనే ఈ రాష్ట్రం, దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మీ అందరి సహకారం కావాలని కోరారు.
