Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 5:20 pm Posted by : ramakrishna

కార్మిక, కర్షక పోరాటాలతో కేంద్రం మెడలు వంచుదాం

 

. . . క్విట్‌ ఇండియా స్ఫూర్తితో హక్కుల కోసం పోరాడాలి

 

. . . సీపీఎం ఎంఎల్ జిల్లా కార్యదర్శి పీ.రామకృష్ణ

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కార్మిక, కర్షక పోరాటాలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజల హక్కులను సాధించుకోవాలని సీపీఐ(ఎంఎల్) కామారెడ్డి మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి పీ. రామకృష్ణ, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ పిలుపునిచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాలని వారు కోరారు. దేశవ్యాప్తంగా ఎస్‌కేఎం, కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జైల్ భరో’ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వదేశీ కార్పొరేట్ సంస్థలు, విదేశీ బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధానాలను అవలంబిస్తోందని వారు విమర్శించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో రైతులను నష్టపరిచే చర్యలకు పాల్పడుతోందని, వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ శక్తులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విదేశీ వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరలకు దిగుమతి చేసుకోవడం వల్ల దేశీయ పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. అదే విధంగా విదేశీ బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చారని, దీంతో కార్మికుల హక్కులు హరించబడుతున్నాయని వారు ఆరోపించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తూ కొత్త పేర్లతో పథకాలను తీసుకువచ్చి వ్యవసాయ కార్మికుల సంక్షేమం నుంచి కేంద్రం తప్పుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. విద్యుత్ రంగానికి సంబంధించి కొత్త చట్టాల ద్వారా ప్రజలు, రైతులపై అదనపు భారాలు మోపే ప్రయత్నం జరుగుతోందని వారు పేర్కొన్నారు. అలాగే అటవీ హక్కుల చట్టం–2006కు బదులుగా అటవీ పరిరక్షణ పేరుతో కొత్త చట్టాలను తీసుకువచ్చి పోడు భూములపై గిరిజనుల హక్కులను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు పోరాటాలను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రజలు ఐక్యంగా ఉద్యమించి తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఏ. ప్రకాష్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి జీ. సురేష్, ఏఐయూకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పీ. పరమేష్, కార్యదర్శి ఆర్. దామోదర్, ఏఐపీకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి. కిశోర్, కోశాధికారి ఎస్. కిశోర్, జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, దేవిదాస్, ప్రసాద్, బాలయ్య, మల్లన్న, గోపాల్, వెంకన్న, బలరాం, రాజు, సత్యం, రాజనర్సు, ముస్తాక్, టీయూసీఐ నాయకులు సాయిలు, రమేష్, శివరామరాజు, లింబవ్వ, పీడీఎస్‌యూ జిల్లా నాయకులు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.