Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2024, 5:21 pm Posted by : ramakrishna

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం

. . . అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే  కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత

. . . పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ ను ప్రజలు క్షమించరు

. . . జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల్, బతుకమ్మ :

 

భారత దేశ చరిత్రలోనే అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన వ్యక్తులను ప్రజలు క్షమించరని అన్నారు. బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఆదివారం జగిత్యాల నియోజకవర్గ నాయకులతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. జగిత్యాలకు తనకు ఆత్మయ అనుబంధం ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.  2014లో నిజమాబాద్ ఎంపీగా తాను గెలిచినా, జగిత్యాల ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ ఓడిపోయారని, కానీ పార్టీలకు అతీతంగా, వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకువాలని, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, అభివృద్ధిలో జగిత్యాల వెనకబడొద్దు అనే ఆదేశాలను కేసీఆర్ ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకోవాలి, చిన్న జిల్లాల ద్వారానే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, గ్రామాల్లో ఉన్న ప్రతి పేద వ్యక్తికి కూడా తెలంగాణ సాధించిన ఫలితం అందుతుందని కేసీఆర్ తెలంగాణ ఉద్యమం రోజుల్లోనే చెప్పేవారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్, జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు, హైదరాబాద్ తరువాత ఎక్కువ సంఖ్యలో, 4500 డబుల్ బెడ్ రూం ఇండ్లు జగిత్యాలకే కేటాయించి ప్రత్యేక శ్రద్ద చూపెట్టారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్, అప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా, పార్టీ ప్రతి కార్యక్రమంలో వేదిక పైకి తీసుకొచ్చి, కాబోయే ఎమ్మెల్యే అంటూ ఐదు సంవత్పరాల పాటు ప్రతి గ్రామంలో చెప్పామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఓడిపోయినా వదిలేయకుండా గౌరవంగా చూసుకుంటామనే సందేశం ఇచ్చిన సభ్యత గల పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఆనాడు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి ఎన్ని ఆకృత్యాలు, ఆఘాయిత్యాలు చేసినా, బీఆర్ఎస్ కార్యకర్తలంతా ముందుండి కొట్లాడారు కాబట్టే, జగిత్యాలలో గులాబీ జెండా ఎగిరిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నాయకులు పార్టీలు మారినా, కార్యకర్తలు పార్టీలోనే ఉంటారని చెప్పడానికి మంచి ఉదాహరణ జగిత్యాల నియోజకవర్గం అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి మారిపోయినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తే అర్థముండేదని, కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా గోడ మీద పిల్లిలాగ ఉండటం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం లాంటిదని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తులను ప్రజలు క్షమించరని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేసారు. ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకోవడం పిరికితనమని, అలాంటి నాయకులు బీఆర్ఎస్ కు అవసరం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేసారు. గులాబీ జెండా అంటేనే గుండె ధైర్యం, గులాబీ జెండా అంటేనే ఉద్యమ పిడికిలి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పిరికివాళ్లు, పదవుల వ్యామోహం ఉన్న వాళ్లు బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదన్నారు.  రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని, పార్టీ నుండి కార్యకర్తలకు, స్థానిక నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్సీ కవిత భరోసానిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్యే పార్టీ మారారనే అంశంతో సంబంధం లేకుండా గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.

Let us explain the government's failures to the public