. . . ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరీష
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
పిల్లల పట్ల చెడు దృక్పధం కలిగి ఉన్న, చెడు పనులు చేసినవారు చట్టం ముందు తలవాల్చక తప్పదని, చట్టపరమైన విజ్ఞానం బడి నుండే మొదలు కావాలని ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరీష తెలిపారు. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ నల్సా ఆదేశాల మేరకు నల్సా రూపకల్పన చేసిన పిల్లల కోసం స్నేహపూర్వక న్యాయసేవలు -పథకం 2024 లో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతున్నదని ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు సముదాయంలోని న్యాయసేవ సదన్ లో నిర్వహించిన సదస్సును ఆమె సహచర అదనపు జిల్లాజడ్జిలు సుగాలి నారాయణ, ధారావత్ దుర్గా ప్రసాద్, క్షత్రి ఉషా కిరణ్, అదనపు జిల్లా కలెక్టర్ వి. భుజంగ రావు,నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు, న్యాయసేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (సిసిఎస్ ) శ్రీశైలం లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. తల్లితండ్రులకు చెప్పని విషయాలు ఉపాధ్యాయులకు చెబుతారని చెప్పిన విషయాలను విశ్లేశించుకుని మంచిచెడును తెలియజేయాలని అన్నారు. పద్దెనిమిది సంవత్సరాల పిల్లలపై లైంగిక దాడులను అరికట్టడానికి అమలులో ఉన్న పోక్సో చట్టం మగ ఆడ పిల్లలకు ఇద్దరికి వర్తిస్తుందని తెలిపారు. కొన్ని సందర్భాలలో మగ పిల్లలు లైంగిక దాడికి గురయ్యే ప్రమాదం ఉన్నదని అన్నారు.”కాదేది కవిత కు అనర్హం” అన్నట్లు పిల్లలపై లైంగిక దాడులు ఎవరు చేసిన ఆఖరికి స్వంత బంధువులు చేసిన పోక్సో చట్టం వర్తిస్తుందని జడ్జి హరీష తెలిపారు. పాఠశాలలలో విద్యార్థులకు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం -2012 షార్ట్ కట్ లో పోక్సో చట్టం గూర్చి అవగాహన కల్పించాలని కోరారు.చిన్న ఆరోపణ వచ్చిన బాలికలను బడికి దూరం చేస్తారని ఆ విదంగా చేయడం వారి విద్యా హక్కును కాలరాచివేయడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల హక్కులు, రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని బయపడాల్సిన పని లేదని ఆమె పేర్కొన్నారు.”బేటీ బచావో, బేటి పడావో “అనే నినాదంను నిజం చేస్తూ ముందడుగులు వేయాలని, చట్టాలు చుట్టాలై మనతో కలిసి నడుస్తాయని సెషన్స్ జడ్జి హరీష అన్నారు. నిజామాబాద్ అదనపు జిల్లా కలెక్టర్ వి. భుజంగ రావు ప్రసంగిస్తు ఉన్నతమైన కార్యక్రమం తీసుకున్న జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ నల్సా విద్యార్థులకు మొగ్గలోనే ఎంతో న్యాయ విజ్ఞానాన్ని అందజేస్తోందని అన్నారు. బాలబాలికలకు సమాన హక్కులు ఉన్నాయని చట్టం ముందు అందరు సమానమేనని న్యాయ సూత్రాన్ని తెలియజేయడం అసమానతల తగ్గుదలకి కారణం కాగలుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.పిల్లలకు దక్కాల్సిన హక్కులు వారికి దక్కనివ్వాలని అన్నారు.పిల్లల ఎదుగుదలకు పాఠశాల ఉత్తమ వనరు అని తెలుపుతు వంద శాతం పిల్లలను పాఠశాల వైపు మల్లించాలని తెలిపారు. డ్రగ్స్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిందని దానికి దూరంగా విద్యార్థులు ఉండే విదంగా ఉపాధ్యాయలోకం కృషి చేయాలని కోరారు.విద్యార్థులకు ఉపాధ్యాయులే మార్గదర్శకులుగా నిలవాలని అదనపు జిల్లాజడ్జిలు సుగాలి నారాయణ, దారావత్ దుర్గా ప్రసాద్, క్షత్రి ఉషా కిరణ్ లు అన్నారు. చట్టాల గూర్చి ఉపాధ్యాయులు తెలుసుకుంటే వాటి విలువను విద్యార్థులకు తెలియజేసిన వారు కాగలరని వారు తెలిపారు.జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ విద్యార్థుల గురువులుగా గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుందని న్యాయసేవ సంస్థలో విన్న చట్టపరమైన విషయాలు తిరిగి విద్యార్థులకే తెలియజేయాలని అన్నారు.న్యాయసేవ అధికార సంస్థ, రాష్ట్ర విద్య శాఖ మధ్య న్యాయ విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలనే అవగాహన ఒప్పందం కుదిరిందని తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నీలకంఠ రావు విద్యార్థుల విద్యభద్రతలో ఉపాధ్యాయుల పాత్ర ఉన్నట్లు సమాజంలో వారి భద్రత పౌర సమాజమే చూడాలని అన్నారు. నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (సిసిఎస్) శ్రీశైలం మాట్లాడుతూ పిల్లల భద్రతకు పోలీసు శాఖ పెద్దపీఠ వేస్తున్నదని అన్నారు. పిల్లలపై జరిగిన నేరాలలో నేర విచారణలో అజాగ్రతకు వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.కార్యక్రమానికి సమన్వయ కర్తగా న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ వ్యవహారించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు పాముజుల శ్రీనివాస్ రావు, వడ్డి హరి కుమార్, కీర్తి రాజ్,న్యాయసేవ సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేధార్, జిల్లా ముఖ్య పరిపాలన అధికారి గోవింద్ రావు, న్యాయవాదులు మాణిక్ రాజు, ఆశ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
