Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 6:08 pm Posted by : ramakrishna

నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి

 

. . . జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి

 

. . . మహిళా వారోత్సవాలలో భాగంగా కలెక్టరేట్ లో మాక్ పార్లమెంట్ నిర్వహణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

విద్యార్ధి దశ నుండే బాలికలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్‌లో శనివారం కిశోర బాలికలతో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన బాలికలు స్పీకర్, డిప్యూటి స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసన సభ్యులు, ప్రతిపక్ష సభ్యుల పాత్రలను పోషిస్తూ సభా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా చట్ట సభలలో జరిగే సమావేశాల తీరును కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరింపజేశారు. మహిళా సాధికారత, బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, ఉపాధి అవకాశాలు, సమాజ అభివృద్ధి తదితర అంశాలపై ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన వారు ప్రశ్నలను లేవనెత్తగా, సంబంధిత శాఖల మంత్రుల పాత్రను పోషించిన బాలికలు సమాధానాలు తెలుపుతూ మహిళలు, బాలికల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. దాదాపు రెండు గంటలకు పైగా మాక్ పార్లమెంట్ సెషన్ అద్యంతం ఎంతో ఆసక్తిగా కొనసాగింది. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల పాత్రలో బాలికలు ఎంతో చక్కగా ఇమిడిపోయి రాణించడం పట్ల కలెక్టర్ వారిని అభినందిస్తూ తన తరఫున పలువురికి ప్రత్యేక బహుమతులు అందించి ప్రోత్సహించారు.

 

Leadership qualities should be developed.

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించడం, సముచిత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, తాము ఆశించిన దానికంటే ఎంతో ఉత్తమంగా బాలికలు రాణించి మాక్ పార్లమెంట్ ను విజయవంతం చేశారని ప్రశంసించారు. బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శిస్తూ, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలని హితవు పలికారు.

 

Leadership qualities should be developed.

 

మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించుకోవాలని, స్మార్ట్ ఫోన్లలో అనవసర విషయాలకు సమయం వృధా చేయకూడదని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆరోగ్యాల పరిరక్షణ కోసం తప్పనిసరిగా పౌష్టిక ఆహారం తీసుకోవాలని అన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే నిస్సంకోచంగా అధికారుల దృష్టికి తేవాలని, భద్రతా పరమైన సమస్యలు ఎదురైనప్పుడు భరోసా కేంద్రాన్ని సంప్రదించవచ్చని సూచించారు.

 

Leadership qualities should be developed.

 

తల్లిదండ్రులు పిల్లలను సమ దృష్టితో పెంచాలని, బాలికల పట్ల వివక్షను ప్రదర్శించకూడదని, వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రోత్సహించాలని హితవు పలికారు. బాలికల విద్యకు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కేరళంలో అక్షరాస్యత 90 శాతానికి పైగా ఉందని, అదే స్పూర్తితో తెలంగాణాలో కూడా అక్షరాస్యతను గణనీయంగా వృద్ధి చెందేలా ప్రతి ఒక్కరు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో తాము గమనించిన పలు సమస్యలు, ఇబ్బందుల గురించి బాలికలు ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం తరపున తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో డీ.ఆర్.డీ.ఓ సాయన్న, డీ.ఈ.ఓ అశోక్, డీ.ఎం.హెచ్.ఓ డాక్టర్ రాజశ్రీ, జిలా సంక్షేమ అధికారిణి పద్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

Leadership qualities should be developed.