. . . అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అధికారులు
బాన్సువాడ, బతుకమ్మ :
వర్ని మండల కేంద్రంలో మార్కెట్ కమిటీలో జాతీయ పతాకం ఆకారంలో కేక్ కట్ చేసిన ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జెండా ఎగరవేసి ఘనంగా జరుపుకున్నాయి. అయితే వర్ని మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా అక్కడి కాంగ్రెస్ నేతలు జాతీయ పతాకం రూపంలో కేక్ తయారు చేసి, జాతీయ పతాకం విధంగా ఉన్న ఆ కేకును కట్ చేసుకుని సంబరాలు జరుపుకున్నారనే విషయం వివాదాస్పదంగా మారింది. జాతీయ పతాకాన్ని గుర్తు చేసే విధంగా తయారు చేసిన కేకును ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కట్ చేయడం పద్ధతి కాదని కొంతమంది అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారు తెలిసి చేశారా తెలియక చేశారా అన్న విషయం పక్కన పెడితే, జాతీయ పతాకాన్ని ఏ విధంగా గౌరవించాలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తెలుసునని పేర్కొంటున్నారు. జాతీయ పతాకాన్ని రోడ్డు పై పడేయడం, చించి వేయడం లాంటి పనులకు పాల్పడితే పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని, జాతీయ పతాకాన్ని ఏ విధంగా గౌరవించాలో రాజ్యాంగం చెబుతుందని గుర్తు చేస్తున్నారు. అలాంటిది మార్కెట్ కమిటీలో కాంగ్రెస్ నేతలు జాతీయ పతాక రూపంలో కేక్ తయారు చేసుకొచ్చి దానిని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కట్ చేయడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పతాకానికి సంబంధించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచిస్తున్నారు.