. . . జిల్లా అధికారులకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన చెవుల శ్యామయ్య కుటుంబానికి చెందిన భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తామని నమ్మించి భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. బాధితుడు చెవుల శ్యామయ్య తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నెంబర్ 711/1లో ఉన్న 14 గుంటల భూమి, సర్వే నెంబర్ 713/1లో ఉన్న 23 గుంటల భూమి మొత్తం 37 గుంటల భూమిని 13 జూన్ 2022న లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన ఏనుగు రాజేశ్వర్ రెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. అదే రోజున ఆ భూమిని మళ్లీ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల గ్రామానికి చెందిన కర్నే కరుణాకర్ పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారానికి భిక్కనూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బోడకుంటి శ్రీధర్, కూరపాటి బాలకిషన్ ప్రధాన కారణమని చెవుల శ్యామయ్య ఆరోపించారు. శ్యామయ్య కుమారుడు రవీందర్ మాట్లాడుతూ, “మా అన్నదమ్ములు, చెల్లి, అమ్మకు తెలియకుండా మా నాన్నకు ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తామని చెప్పి భిక్కనూర్ తహసిల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు విషయం తెలిసిన తర్వాత రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్‌ను ప్రశ్నించగా, 2024లో తిరిగి తమ పేరుపై భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని పదిమంది సమక్షంలో బాండ్ పేపర్ రాసి ఇచ్చాడని తెలిపారు. ఆ గడువు ముగిసిన తర్వాత మళ్లీ మరో పత్రం రాసిచ్చాడని, అనంతరం ఈ నెల 6వ తేదీన తప్పకుండా రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదని ఆరోపించారు. అలాగే, “తాను ఒక పత్రిక విలేకరి అని, ఎవరికి చెప్పుకుంటే చెప్పుకోండి” అంటూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని రవీందర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు, భిక్కనూర్ తహసిల్దార్ స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది.