. . . ముగ్గురు నిందితుల అరెస్ట్
. . . భూముల కొనుగోళ్లలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
. . . జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలో నకిలీ పత్రాల ఆధారంగా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన కేసును దేవునిపల్లి పోలీసులు ఛేదించారు. అసలు యజమాని స్థానంలో మరో వ్యక్తిని ప్రవేశపెట్టి రిజిస్ట్రేషన్ చేయించిన ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు అతని భార్య, మామను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గంభీరావుపేటకు చెందిన ముక్తావరం శాంత తన భర్త ముక్తావరం వెంకటయ్య పేరుపై ఉన్న దేవునిపల్లి వార్డు పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ, సర్వే నెం.210/1లోని ప్లాట్ నెం.71 (సుమారు 200 చదరపు గజాలు)ను నకిలీ పత్రాల ద్వారా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, దేవునిపల్లి ఎస్‌హెచ్‌ఓ రంజిత్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. దర్యాప్తులో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రికార్డులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన పత్రాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఆరగొండ గ్రామం, రాజంపేట్ మండలానికి చెందిన బండారి శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. అప్పుల భారాన్ని తీర్చుకునేందుకు బండారి శ్రీనివాస్ రెడ్డి భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని విక్రయించేందుకు పథకం రచించినట్లు విచారణలో వెల్లడైంది. ఇందులో భాగంగా తన భార్య బండారి సునీతను కొనుగోలుదారుగా చూపించి, తన మామ గున్‌రెడ్డి సంగారెడ్డిని అసలు భూ యజమాని ముక్తావరం వెంకటయ్యగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తేలింది. తప్పుడు గుర్తింపు పత్రాలు, నకిలీ ఆధారాలతో దేవునిపల్లి వార్డు పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ, సర్వే నెం.210/1లోని ప్లాట్ నెం.71ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఆ తర్వాత అసలు విషయాన్ని దాచిపెట్టి అదే భూమిని ఇతరులకు విక్రయించినట్లు, ఆ స్థలం పలువురి పేర్లపై వరుసగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. శాస్త్రీయ దర్యాప్తు, సాంకేతిక ఆధారాలు, రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాల పరిశీలనతో నిందితుల మోసం వెలుగులోకి వచ్చింది. విచారణలో ప్రధాన నిందితుడు బండారి శ్రీనివాస్ రెడ్డి తన నేరాన్ని అంగీకరించగా, శ్రీనివాస్ రెడ్డి తో పాటు బండారి సునీత, గున్‌రెడ్డి సంగారెడ్డి లను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర మాట్లాడుతూ భూములు, స్థలాల కొనుగోలు సమయంలో ప్రజలు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భూమి యాజమాన్య హక్కులు, గత రిజిస్ట్రేషన్ వివరాలు, రెవెన్యూ రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు, ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) వంటి పత్రాలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. విక్రయదారుడు నిజమైన యజమానియేనా అనే విషయాన్ని ఆధార్, ఫొటో గుర్తింపు, బయోమెట్రిక్ వివరాలు, సంబంధిత అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించారు. మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు లభించే భూములు, అనుమానాస్పద లావాదేవీల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. నకిలీ పత్రాలు సృష్టించడం, తప్పుడు వ్యక్తులను అసలు యజమానులుగా చూపించి రిజిస్ట్రేషన్లు చేయించడం, ప్రజలను మోసం చేయడం వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. భూ మోసాలను అరికట్టడంలో ప్రజల అప్రమత్తత కీలకమని, అనుమానాస్పద భూ లావాదేవీలు లేదా మోసాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలని ఎస్పీ కోరారు.