Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2025, 10:04 pm Posted by : ramakrishna

రైల్వే బైపాస్ కోసం స్థల సేకరణ

  • భూ సేకరణ కోసం సర్వే చేసిన రైల్వే అధికారులు

 

నిజామాబాద్, బతుకమ్మ : పెద్దపల్లి  హైదరాబాద్ మధ్య రైళ్ళ రాకపోకల కోసం కొత్త రైల్వే బైపాస్ కోసం భూసేకరణపై రైల్వే యంత్రాంగం సర్వే చేపట్టింది. స్థానికంగా డిచ్ పల్లిలో నిర్మించనున్న రైల్వే బైపాస్ వల్ల నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు ట్రాఫిక్ జాం తగ్గనుంది. నేరుగా రైళ్లు డిచ్ పల్లి  రైల్వేస్టేషన్ కు అనుసంధానిస్తూ బైపాస్ లైన్ నిర్మాణంతో రైళ్ల రాకపోకలకు కేంద్రంగా మారనుంది. తద్వారా నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చే రైళ్ళు రాకుండానే కరీంనగర్, పెద్దపల్లి నుంచి వచ్చే రైళ్లు నేరుగా హైదరాబాద్ కు వెళ్లేందుకు మార్గం ఏర్పడనుంది. గత రెండు సంవత్సరాల క్రితం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ రైల్వే బైపాస్ లైన్ కోసం ప్రతిపాదనలు పంపారు. చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి మేరకు డిచ్ పల్లి వద్ద నిర్మించే ప్రతిపాదిత స్థలం కోసం భూసేకరణకు రైల్వే శాఖ 2024లోనే ప్రతిపాదనలు చేసింది. నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డు వద్ద దాదాపు 272 మంది కొనుగోలు చేసిన ప్లాట్ల మీదుగా రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగనుండడంతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన చాలా మంది భూమిని ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు. రైల్వే శాఖ ఇచ్చే పరిహారం ఏ మాత్రం సరిపోదని లక్షలు పోసి కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్ భూముల విలువ ఆధారిత పరిహారం చెల్లింపును ఒప్పుకోవడం లేదు.

Land acquisition for railway bypass

గతేడాది అక్కడ రైల్వే, రెవెన్యూ అధికారులు సర్వే చేయగా అడ్డుకున్నారు. ఇప్పటికే అక్కడ రైల్వే బైపాస్ నిర్మాణానికి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం నుంచి మరోసారి రైల్వే శాఖాధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి స్థల సేకరణ విషయంలో సర్వే నిర్వహించారు. సర్వేకు రెండు శాఖల అధికారులు రావడంతో ఎక్కడ స్థానికులు అడ్డుకుంటారోనని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 4 బైపాస్ రైల్వేలైన్ల నిర్మాణం ప్రతిపాదనలు ఉండగా అందులో నిజామాబాద్ కు ప్రత్యేక స్థానం ఉంది. 1.55 కిలో మీటర్ల రైల్వే బైపాస్ లైన్ నిర్మాణం కోసం కేంద్ర రైల్వేమంత్రిత్వ శాఖ 121.97 కోట్లను భూసేకరణ కోసం కేటాయించింది.ఈ రైల్వే బైపాస్ లైన్ పూర్తయితే ఒక్కో రైలుకు గంట పది నిమిషాల సమయం ఆదా కానుంది. ఈ రైల్వే బైపాస్ నిర్మాణం జరిగితే రైల్వే శాఖ ప్రధానంగా నిజామాబాద్ కేంద్రంపై ఉన్న ట్రాఫిక్ జాంను తగ్గించడంతో పాటు అదనంగా కొత్త రైళ్ళను కేటాయించే అవకాశం ఉంది.  ఎక్స్ ప్రెస్ రైళ్ళను కూడా నిజామాబాద్ మీదుగా పెంచే అవకాశం ఉంది. ఆరు రైల్వే బైపాస్ లైన్లను అనుసంధానం చేస్తూ చేసే నిర్మాణంపై స్థానికంగా భూములు కోల్పోతున్న వారు భూములను ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు. మరో రెండు రోజుల పాటు భూముల సేకరణ కోసం సర్వే జరిగే అవకాశం ఉంది. సంబంధిత సర్వే నివేదికను రైల్వే శాఖకు పంపనుండగా పరిహారం విషయంలో రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు.