. . . రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు హాజరు
. . . భారీగా తరలివచ్చిన గ్రామస్తులు
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని పెద్ద చెరువు భూములు కొందరు భూకబ్జాదారుల చెరలో చిక్కుకుని క్రమంగా కుచించుకుపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు శిఖం భూములను కాపాడాలని కోరుతూ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ నూకని గంగామణి గంగారం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్ కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేగులపల్లి భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని కలిసి చెరువు ఆక్రమణల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, కబ్జాకు గురైన చెరువు శిఖం భూములను గుర్తించి వెలికితీయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సోమవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇందల్వాయి పెద్ద చెరువు సర్వేను అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. సర్వే సందర్భంగా గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు మరియు పోలీసుల సమన్వయంతో పరిస్థితిని అదుపులో ఉంచారు. ఎస్సై సుమలత ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా, గ్రామస్తుల సహకారంతో చెరువు సర్వేను పూర్తి చేస్తామని తహసీల్దార్ బాలయ్య తెలిపారు. చెరువు భూముల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్ గంగామణి గంగారం, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ మహేందర్, వైస్ చైర్మన్ రఘుపతి రెడ్డి, జితేందర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.