Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:25 pm Posted by : ramakrishna

అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి అండగా నిలిచిన కేటీఆర్

 

. . . చిన్నారి భవిష్య వైద్యానికి సహకారం

 

. . . కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్య వైద్య చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందించి, ఆమెకు విజయవంతంగా మైనర్ శస్త్రచికిత్స పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. చికిత్స అనంతరం కోలుకున్న చిన్నారి భవిష్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసంలో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన, భవిష్య మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఎదగాలని, చదువుల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గత నెల మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలో అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. ఆ సమయంలో యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్య ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య గురించి తెలుసుకున్నారు. చిన్నారికి మైనర్ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించిన విషయం తెలియడంతో, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మెరుగైన వైద్య సేవలు అందేలా పార్టీ తరఫున అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం భవిష్యకు చికిత్స అందేలా అన్ని విధాలా సహకరించిన కేటీఆర్‌కు యాదిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి భరోసా కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.

 

KTR stood by the family of martyr Yadi Reddy.