Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 December 2024, 1:59 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వరం కేకేవై హైవే

హైదరాబాద్, బతుకమ్మ:  ఎల్లారెడ్డి నియోజకవర్గానికి కరీంనగర్ – కామారెడ్డి – ఎల్లారెడ్డి(కేకేవై) హైవే వరమని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. కేకేవై హైవే పనులపై మదన్ మోహన్ బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమయ్యే కేకేవై హైవే సిరిసిల్ల, కామారెడ్డి మీదుగా ఎల్లారెడ్డి వరకు వస్తుందని, పిట్లం వద్ద నేషనల్ హైవే 161తో కలుస్తుందన్నారు. నిజాంసాగర్ రోడ్డును సుమారు వందేళ్ల క్రితం 1923లో మంజీరా నదిపై నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిజాం నవాబు కామారెడ్డి పట్టణం నుంచి ప్రాజెక్టు వరకు ఎద్దుల బండి వెళ్లే రోడ్డును నిర్మించారని సభకు తెలిపారు. కాలక్రమేణ అదే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డులో అనేక ప్రమాదాలు చోటు చేసుకునేవని, పోలీసుశాఖ నివేదికల ప్రకారం ప్రతి ఏడాది 20 మంది చనిపోయేవారన్నారు. ప్రస్తుత రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కేకేవై హైవే తో రోడ్డు ప్రమాదాలను నివారించిన వారమవుతామని పేర్కొన్నారు. కేకేవై హైవే వెంబడి ఉన్న పట్టణాలు, పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు.