Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 6:06 pm Posted by : ramakrishna

లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు

హైదరాబాద్, బతుకమ్మ :   మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ ప్రకాశ్ తో కలిసి మరో కీలక నేత పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను మీడియా  సమావేశంలో డీజీపీ వెల్లడించారు.   1980లో పుల్లూరి ప్రసాదరావు కిషన్ జీకి అనుచరుడిగా మారారు. 17 ఏళ్ల పాటు మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో పుల్లూరి ప్రసాద్ రావు లొంగిపోయారని డీజీపీ తెలిపారు. మరో మావోయిస్టు నేత బండ ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో పని చేశారు. అతని స్వస్థలం తెలంగాణలో మంద మర్రి. ఏడో తరగతి చదువుతున్నప్పుడే నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. బండ ప్రకాశ్ పై ఉన్న రూ. 20 లక్షల రివార్డు, పుల్లూరి ప్రసాదరావు పై ఉన్న రూ. 25 లక్షల రివార్డులు వారికే  ఇస్తామన్నారు. తెలంగాణకు చెందిన ఇంకా 64 మంది మావోయిస్టులుగా కొనసాగుతున్నారు. జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులపై  ఎలాంటి చర్యలు ఉండవని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.