కరీంనగర్, బతుకమ్మ :
కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెల్లరి దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారం రోజులుగా పలు రాష్ట్రాల్లో సాగుతున్న గాలింపు చర్యల ఫలితంగా నిందితులను పట్టుకున్న పోలీసులు, కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడిని నిన్న అర్ధరాత్రి కరీంనగర్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి ద్వారా మిగతా నిందితుల అచూకీ కోసం ప్రత్యేక బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి. దోపిడీ అనంతరం కరీంనగర్ నుంచి ధర్మపురి మార్గంగా పారిపోతున్న సమయంలో దుండగులు మద్దునూర్ వద్ద ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను పగులగొట్టి పడేసినట్లు తెలిసింది. ఆ మొబైల్ ఫోన్‌ను అక్కడి యువకులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఆ ఫోన్‌లో కేసుకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు విచారణ కోసం పోలీసులు పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇద్దరు నిందితులతో పాటు, దోపిడీ చేసిన బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యాపారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కొంతమేర దోచుకున్న సొత్తును కూడా రికవరీ చేసినట్లు సమాచారం. పాత నేరస్థుల డేటాబేస్‌తో నిందితుల వివరాలను సరిపోల్చుతూ పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడితో పాటు మరో దుండగుడు పోలీసుల అదుపులో ఉండగా, ఇంకా పరారీలో ఉన్న మరో ముగ్గురు దోపిడీ దొంగల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది.