Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 7:12 pm Posted by : ramakrishna

అనుమతులు లేని కేశాపూర్ నారాయణ జూనియర్ కాలేజీని సీజ్ చేయాలి

 

. . . విద్యార్థి సంఘాల ఫిర్యాదుపై కలెక్టర్ ఆదేశాలు

 

. . . జిల్లా ట్రైనీ కలెక్టర్‌కు విద్యార్థి సంఘాల వినతి

 

. . . అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేశాపూర్‌లో అనుమతులు లేకుండా కొనసాగుతున్న నారాయణ జూనియర్ కాలేజీపై తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు టీజీవీపీ, యూఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎఫ్‌డీఎస్ విద్యార్థి సంఘాల నాయకులు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా కళాశాలను నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో నారాయణ యాజమాన్యం చెలగాటమాడుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. అధికారులు తనిఖీలకు వచ్చే సమయంలో కళాశాల పరిస్థితులు బయటపడకుండా విద్యార్థులను సమీపంలోని పార్కులకు తరలిస్తున్నారని, దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అనుమతులు లేని కేశాపూర్ నారాయణ జూనియర్ కాలేజీని వెంటనే సీజ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు విద్యార్థి సంఘాలు వెల్లడించాయి. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ), విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇంతకాలం అనుమతులు లేని కళాశాలపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడంపై డీఐఈఓ ను కలెక్టర్ ప్రశ్నించినట్లు సమాచారం. చర్యలు ఆలస్యం కావడానికి గల కారణాలపై సరైన వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. కళాశాల పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు త్వరలో ప్రత్యేక తనిఖీ నిర్వహిస్తానని కలెక్టర్ స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్, యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి, ఏఐఎఫ్‌డీఎస్ కార్యదర్శి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.