. . . కేసీఆర్ చిత్రపటానికి ముఖరా (కే) గ్రామ రైతులు పుష్పాభిషేకం
ఆదిలాబాద్, బతుకమ్మ :
కేసీఆర్ సార్… నువ్వు మళ్లీ రావాలి, నువ్వు వస్తేనే మాకు వ్యవసాయానికి త్రీఫేజ్ 24 గంటల కరెంట్ వస్తది అంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖరా (కే) గ్రామ రైతులు కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. కేసీఆర్ సార్ నువ్వు లేక మాకు ఏడు గంటల కరెంటే దిక్కయింది. ఆ ఏడు గంటల కరెంట్ కూడా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. లో-వోల్టేజ్ కారణంగా మోటార్లు కాలిపోతున్నాయి. నువ్వు వస్తేనే త్రీఫేజ్ 24 గంటల కరెంట్ వస్తది అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందేదని, పుష్కలంగా నీళ్లు వచ్చేవని రేవంత్ సర్కార్ వచ్చాక వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందడం లేదని అన్నారు. ప్రస్తుతం వచ్చే కరెంట్ కూడా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, లో-వోల్టేజ్ కారణంగా మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు.కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుందా అని చూసే రైతులు … ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కేసీఆర్ ఉంటే రైతులకు భరోసా ఉండేదని, 24 గంటల కరెంట్ ఉండేదని, పొలాలకు నీళ్లు అందేవని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. వ్యవసాయ రంగానికి వెంటనే 24 గంటల త్రీఫేజ్ కరెంట్ అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని, మళ్లీ కేసీఆర్ వస్తేనే తమ బతుకులు మారుతాయని అన్నారు. కేసీఆర్ వస్తేనే రైతులకు 24 గంటల కరెంట్, పొలాలకు నీళ్లు వస్తాయని, కేసీఆర్ ఉంటేనే రైతులు రాజుగా బతుకుతారని పేర్కొన్నారు. మళ్లీ నువ్వే రావాలి కేసీఆర్ సార్ అంటూ కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, దత్త, ప్రహ్లాద, నాగనాథ్, తులసీరాం, రాంకిషన్, మారుతి రైతులు పాల్గొన్నారు.