నిజామాబాద్, బతుకమ్మ: డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో మాయమాటలు చెబుతూ మాజీ సీఎం కేసీ ఆర్ ప్రజలను మోసం చేశారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శించారు. నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ధన్ పాల్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్బన్ లో గత పదేళ్ల నుంచి ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని, తెలంగాణకు కేంద్రం కేటాయించిన ఆవాస్ యోజన నిధులను పక్కదారి పట్టించిన ఘనత కేసీ ఆర్ ది అని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు శిథిలావస్థకు చేరాయని, కూలిపోయే పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులున్నారు.
