. . . కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
. . . పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు
హైదరాబాద్ , బతుకమ్మ:
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత పాలమూరు గడ్డ మీది నుంచే రాజకీయంగా మొదటి అడుగు వేయనున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగుతానని ప్రకటించిన కల్వకుంట్ల కవిత అన్నట్టుగానే ఈనెల 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కృష్ణా జలాల సాధనకు శంఖారావం పూరించనున్నారు.

సోమవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకులు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సాధన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈసంధర్బంగా నాయకులు మాట్లాడుతూ…8న ఉదయం జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకోనున్న కవిత అదే రోజు సాయంత్రం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రతిపాదించిన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలోని చౌదరిగూడెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తన మొదటి ప్రాధాన్యతగా కృష్ణా జలాల సాధనకు శ్రీకారం చుట్టారు. ఈనెల 8న చౌదరిగూడెం వద్ద ‘‘పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ’’ నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వెనుకబడి ఉండటానికి పాలకుల లోపభూయిష్ట విధానాలే కారణమని పలు వేదికలపై నుంచి కవిత స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నీళ్లను సమర్థవంతంగా వినియోగించుకుంటూ మన బీళ్లకు మళ్లించుకునేందుకు తమ వద్ద స్పష్టమైన విధానాలు ఉన్నాయని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే కృష్ణా నీళ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు.
‘‘పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ’’ పోస్టర్ ఆవిష్కరణ
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇచ్చే కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సహా మూడు ప్యాకేజీల పనులను 11 ఏళ్ల తర్వాత కూడా ప్రారంభించకపోవడంపై ఉద్యమానికి కవిత శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నవీన్ ఆచారి, గొంగళ్ల రంజిత్ కుమార్, సయ్యద్ ఇస్మాయిల్, నరేశ్ ప్రజాపతి, ఎదురుగట్ల సంపత్ గౌడ్, సీమ రమేశ్, బుచ్చిబాబు, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.