- కాళేశ్వరంపై కవిత వ్యాఖ్యలతో రాజుకున్న కుంపటి
- కొనసాగుతున్న మాటల యుద్దం
- అనుచరులచేత ఒకరిపైఒకరు బురదచల్లుకునే యత్నం
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వేముల ప్రశాంత్ రెడ్డి మానస పుత్రుడు. కల్వకుంట్ల కవిత కేసీఆర్ పుత్రిక. వారిద్దరు అన్నచెల్లెల మాదిరిగా నిజామాబాద్ జిల్లాలో రాజకీయంగా తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఎదిగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంలో నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కలేదు. కానీ ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకానికి ప్రశాంత్ రెడ్డిని వైస్ చైర్మన్ గా నియమించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలిగా గెలుపొందారు. ఇద్దరు సోదర,సోదరిమణులులాగానే వ్యవహరిస్తూ జిల్లా రాజకీయాలను శాసించారు. అయితే రెండవ దఫా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో జరిగిన ఎన్నికల్లో కవిత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన విషయం తెల్సిందే. అయితే కేసీఆర్ ఆమెకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిని ఇచ్చాడు. రెండవసారి ఎమ్మెల్సీగా పని చేస్తున్న కవిత పై లిక్కర్ స్కాం కేసులో ఈడి అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపిన విషయం తెల్సిందే. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత పార్టీ అధినాయకత్వంపై ప్రధానంగా హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ లపై పరోక్షంగా ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత కవిత తెలంగాణ జాగృతి పక్షాన ప్రత్యక్షంగా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ కీలక నేతలపై అవినీతి, ఆరోపణలు చేశారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో జనం బాట సందర్భంగా కాళేశ్వరంపై కవిత చేసిన వ్యాఖ్యలు నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కుంపటిని రాజేశాయి.

కవిత నాగమడుగు ప్రాజెక్టును సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు వలన నిజామాబాద్ జిల్లాకు ఒరిగిందేమి లేదని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ప్రధానంగా కవిత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్కసారి మాత్రమే హల్దీ వాగు నుంచి నిజాంసాగర్ కు నింపారని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కోసం కేసీఆర్ హయంలో నిర్మించిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో ఒక్కసారి మాత్రమే నీళ్ళను రివర్స్ పంపింగ్ చేశారని తర్వాత దానితో ఎలాంటి పని లేకుండాపోయిందని చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా జిల్లాకు చెందిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి చేశారని స్పష్టమయ్యాయి. ఈ వ్యవహారంలో అప్పటి వరకు తెలంగాణ జాగృతి అధినేత్రి, కేసీఆర్ తనయపై సస్పెన్షన్ కాలం నుంచి ఒక్క మాట అనని ప్రశాంత్ రెడ్డికి కవిత మధ్య గ్యాప్ తెచ్చిపెట్టింది. అదే సమయంలో నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, జాగృతి నాయకులు పరస్పరంగా ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశం నిర్వహించడం కలకలం రేపింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కవితను టార్గెట్ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర దుమారం రేపాయి. కవిత ఎంపీగా ఎన్నికైన తర్వాత బంగారు దుకాణాలకు పోయి డబ్బులు చెల్లించకుండా నగలు తీసుకున్నారని, షాపింగ్ మాల్స్ వెళ్లి డబ్బులు కట్టకుండా చీరలను పట్టుకుపోతారని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కె టాక్స్ పేరిట ఎంపీగా ఉన్నప్పుడు మంజీరా, గోదావరి నదుల్లో ఇసుక దందా చేశారని ఆరోపణలు చేశారు. కల్లుడిపోల వద్ద నెలవారి మామూళ్ళు తీసుకున్నారని, చివరకు గుట్కా వ్యాపారులను వదలలేదని వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ రాణిగా మారి ఢిల్లీలో చేసిన దందాతో జైలు పాలయ్యారని, గూగుల్ లో వెతికితే లిక్కర్ రాణి కవిత వస్తుందని ప్రశాంత్ రెడ్డి అనుచరులు చేసిన వ్యాఖ్యలపై కవిత అనుచరులు, జాగృతి నాయకులు మండిపడుతున్నారు. కవిత అనుచరులు, జాగృతి నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టులోని ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ధనార్జన వెనుక మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. మెకానికల్ పనులు వ్యయం పంప్ హౌజ్ ల నిర్మాణం కోసం రూ.600 కోట్ల వ్యయాన్ని రూ.1400 కోట్లకు ప్రశాంత్ రెడ్డి పెంచలేదా అని ప్రశ్నించారు. 2 వేల కోట్లు పెట్టి నిర్మించిన పునరుజ్జీవ పథకంతో 2.50 టీఎంసీలను ఎత్తిపోశారని వరద వస్తే స్పిల్ వే ద్వారా నీటిని కిందకు వదిలారని ఆరోపించారు. ప్రశాంత్ రెడ్డి సోదరులు ఇసుక, గ్రానైట్ వ్యాపారం చేసింది ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో గంజాయి దందా వెనుక ప్రశాంత్ రెడ్డి తమ్ముడి హస్తం ఉందని ఆరోపించారు. ప్రశాంత్ రెడ్డికి, ఎంపీ అర్వింద్ కు మధ్య లోపాయికారి ఒప్పందం ఏమిటని కవిత అనుచరులు చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
