Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 10:32 am Posted by : ramakrishna

మల్కాజిగిరి -కామారెడ్డి మధ్య కవచ్ 4.0

 

. . . విజయవంతంగా స్వదేశీ రైలు రక్షణ వ్యవస్థ

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వదేశీ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్’ అమలులో తెలంగాణ మరో ఘనతను సాధించింది. ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మల్కాజిగిరి – కామారెడ్డి సెక్షన్ పరిధిలో 108 రూట్ కిలోమీటర్ల మేర అత్యాధునిక ‘కవచ్ 4.0’ వెర్షన్‌ను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను మరింత సురక్షితంగా నిర్వహించడానికి ఇది ఎంతగానో దోహదపడనుంది. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థ అయిన కవచ్‌లో 4.0 వెర్షన్ అత్యంత ప్రామాణికమైనది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌ఓ) అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత ద్వారా చాలా పనులు నిర్వహించవచ్చు. లోకో పైలట్ పొరపాటున సిగ్నల్ దాటి ముందుకు వెళ్తే కవచ్ వ్యవస్థ తక్షణమే స్పందించి రైలును ఆటోమేటిక్‌గా ఆపుతుంది. ఎదురెదురుగా లేదా ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ప్రమాదకరంగా సమీపిస్తున్నప్పుడు ఘర్షణను నివారించడానికి ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దట్టమైన పొగమంచు, వర్షం లేదా ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సిగ్నల్స్ సరిగ్గా కనిపించకపోయినా లోకో పైలట్ క్యాబిన్ డిస్‌ప్లే యూనిట్ ద్వారా సిగ్నల్ సమాచారం స్పష్టంగా తెలుస్తుంది. వంతెనలు, మలుపుల వద్ద నిబంధనల కంటే ఎక్కువ వేగంతో వెళ్తుంటే ఈ సిస్టమ్ స్వయంచాలకంగా వేగాన్ని వేగ పరిమితికి తగ్గిస్తుంది.