. విజయ డెయిరీ మనుగడుపై నీలినీడలు
. కనుమరుగవుతున్న కేంద్రాలు
. కలెక్టర్, ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉన్నా ఫలితం లేని వైనం
. నానాటికి తగ్గుముఖం పడుతున్న పాలసేకరణ
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లాలో కరీంనగర్ డెయిరీ పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పాల కేంద్రాలు, రైతుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తూనే తమ సంస్థకు పాలు పోయాలని ఒప్పందాలు చేసుకుంటోంది. గత కొన్నేళ్ళుగా జిల్లాలో కరీంనగర్ డెయిరీ పాల ప్యాకెట్లు, పాల ఉత్పత్తులకు సంబంధించి దుకాణాలను తెరిచి విక్రయిస్తుండగా, విజయ డెయిరీ అచేతనంగా మారింది. ఇప్పుడు ఏకంగా కరీంనగర్ డెయిరీ బీఎంసీ ఏర్పాటు చేయబోతోంది. అదే జరిగితే సారంగాపూర్ లోని మిల్క్ షెడ్ మూత పడడం ఖాయమనే మాట రైతుల నుంచి వినబడుతోంది. ప్రస్తుత అధికారుల నిర్వాకం కారణంగా విజయకు దూరమైనవారే కరీంనగర్ డెయిరీకి దగ్గరవుతుండడం గమనార్హం.
పక్కా ప్రణాళితో ఉమ్మడి జిల్లాలోకి..
విజయ డెయిరీలోపని చేసే కొందరు అధికారులు రైతులతో ఇష్టారీతి న మాట్లాడటం, పాల సేకరణను నిర్లక్ష్యం చేయడం తదితర అంశాలను ఓ కంట గమనిస్తున్న కరీంనగర్ డెయిరీ అధికారులు దీన్ని తమ బిజెనెస్ విస్తరించేందుకు అవకాశంగా మార్చుకోవాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా పాల ప్యాకెట్ల విక్రయంతో ప్రారంభించారు. అయితే పాల సేకరణ తో బిజినెస్ ను పెంచాలనే ఆలోచనతో ముందుగా బోధన్ ప్రాంతంలో బీఎంసీని వేయాలని యోచించి విరమించుకున్నారు. ప్రైవేట్ విభాగమైన కరీంనగర్ డెయిరీ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి ఆర్మూర్ డివిజన్ లోని బడా భీమ్ గల్, భీమ్ గల్ మధ్య లేదా నిజామాబాద్ డివిజన్ లోని సిరికొండ, ధర్పల్లి మండల కేంద్రాల మధ్య బీఎంసీ వేస్తే ఎలా ఉంటుందని రైతుల అభిప్రాయాలను సేకరించారు. విజయ డెయిరీకి వెన్నుముకగా ఉన్న ధర్పల్లిలో బీఎంసీ వేస్తేనే చుట్టుపక్కల నుంచి మరిన్ని పాలను సేకరించొచ్చని మేనేజ్ మెంట్ కు వివరించారు. వర్షం కాలం ప్రారంభం నాటికి బీఎంసీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసి రైతులకు చేరువ కావడంతోపాటు పాలన్నింటిని కరీంనగర్ కు తరలించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక్కోటి ఎత్తివేత..
ధర్పల్లి బీఎంసీ కేంద్రంగా సారంగాపూర్ మిల్క్ షెడ్ కు పెద్ద మొత్తంలో పాలు వచ్చేవి. అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా రానురాను కేంద్రానికి పాల రాక తగ్గింది. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ లలో ఉన్న కేంద్రాలను దాదాపు మూతపడేలా చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరులో లాభదాయకంగా నడుస్తున్న బీఎంసీని ఎత్తివేసి, శీతలీకరణ యంత్రాలను నిర్మల్ జిల్లాకు తరలించారు. ఒక్కో కేంద్రాన్ని ఏదో ఒక కారణంతో మూత పడే విధంగా చేస్తూ వస్తున్నారు. విజయ డెయిరీ మనుగడ గత ఐదేళ్ళ నుంచి డోలాయమానంలో పడింది.
ప్రైవేటు బీఎంసీ పడితే..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయ డెయిరీ పాలు, పదార్థాలను జిల్లా ప్రజలకు చేరువయ్యేలా చూడాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పదేపదే సూచిస్తున్నారు. దీనిలో భాగంగా చైర్మెన్ అమిత్ రెడ్డిని, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మిల్క్ షెడ్ సందర్శనకు పిలిపించారు. విజయ పాలనే వాడాలని అధికారిక సమావేశాల్లోనూ, వసతి గృహాల తనిఖీకి వెళ్ళినపుడు కలెక్టర్ సూచిస్తున్నారు. అధికారుల నుంచి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఉన్నప్పటికీ విజయ డెయిరీ అధికారులు తమ లక్ష్యాన్ని అందుకోవడంలో నిర్లిప్తతను కనబరుస్తున్నారు. జిల్లా పాలనాధికారి, బోధన్ ఎమ్మెల్యే సహాయ సహకారం ఉన్నప్పుడు మెరుగైన ఫలితాలను సాధించాల్సిన అధికారులు రోజురోజుకు నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. సందట్లో సడేమియగా కరీంనగర్ డెయిరీ బీఎంసీ నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైతే విజయ డెయిరీ నడవడం గగనమే అవుతుందనే చర్చ పాడి రైతుల్లో మొదలైంది.