. . . కౌన్సిలర్ గా ఉమారాణి ఎన్నిక చెల్లదని కోర్టు లో కేసు
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నిక చెల్లదంటూ వారి రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ 38 వార్డులోంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి రాష్ట్ర ఎన్నికల నియమాల కి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికయ్యారని వారి రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో కేసు నంబర్ ఈఎల్ఈసి. ఓపి 1 ఆఫ్ 2026 ద్వారా దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా ప్రధాన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. దీంతో ఉమారాణి కౌన్సిలర్ ఎన్నిక విషయంలో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన ఉమారాణికి పదవి గండం ఏర్పడుతుంది. మున్సిపల్ చైర్ పర్సన్ కోర్టు కేసు కామారెడ్డి జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక జరిగి పక్షం రోజులకే కోర్టు కేసులు నమోదు కావడం కలకలం రేపింది. గత నెలలో జరిగిన కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడం తో కాంగ్రెస్ తరుపున రెబల్ గా గెలిచినా ఉమారాణి కాంగ్రెస్, బిఆర్ఎస్, స్వతంత్రుల మద్దత్తు తో చైర్ పర్సన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లా కేంద్రం లో మున్సిపల్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య నిప్పు రాజేసింది. ఆ మంటలు చల్లారక ముందే మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న ఉమారాణి కౌన్సిలర్ గా ఎన్నిక చెల్లదని కాంగ్రెస్ అభ్యర్తిగా పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థి కోర్టు ను ఆశ్రయించడం కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చింది. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలకు ఇది పరాకాష్టగా చెప్పాలి. కోర్టు తీర్పు సంగతి దేవుడు ఎరుగు కానీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇలాకా లో కాంగ్రెస్ పార్టీ లో పరిణామాలు ఊహించడం సాధ్యం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.