Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 5:41 pm Posted by : ramakrishna

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కామారెడ్డి ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి

బాన్సువాడ, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ఎన్నికల విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం బాన్సువాడలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్ స్వీకరణ విధానం, నామినేషన్ ఫారాలు, సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే మొదటి రోజు ఆయా డివిజన్లు, వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలను తెలుసుకున్నారు.నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, అప్పీళ్ల పరిష్కారం గుర్తుల కేటాయింపు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటన తదితర అన్ని ప్రక్రియలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి పాటిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు తదితరులు పాల్గొన్నారు.