- 42 శాతం బీసీ రిజర్వేషన్ల డిక్లరేషన్ సభ వాయిదా
- త్వరలో నిర్వాహణ తేదీలపై పీసీసీ ప్రకటన
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై జరుపాల్సిన బీసీ గర్జన వాయిదా పడింది. ఈ నెల 15న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగాల్సిన బీసీ గర్జనను భారీ వర్షాల కారణంగా వాయిదా వేస్తూ పీసీసీ ప్రకటన చేసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో ఒక్కటైనా బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో గవర్నర్ ఆమోదం విషయం పెండింగ్ లో ఉండగా, స్థానిక సంస్థల నిర్వాహణపై హైకోర్టు డెడ్ లైన్ విధించడంతో ప్రజల్లోకి ఈ విషయాన్ని చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జనను చేపట్టాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. ఈ నెల 7న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐదుగురు మంత్రులు పర్యటించి బీసీ గర్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. లక్ష మందితో నిర్వహించే బీసీ గర్జన సభకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున్ ఖర్గె, రాహుల్ గాంధీలతో పాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని ప్రతి నియోజకవర్గం నుంచి 15 వేలకు తక్కువ కాకుండా జనాలను తరలించాలని ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ విజయవంతం కోసం రెండు జిల్లాలకు మంత్రులను ఇంచార్జిలుగా నియమించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక నేతను ఇంచార్జిగా నియమించి సభ సక్సెస్ బాధ్యతలను మోపారు.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీ తీర్మాణం చేసి దాని అమలు కోసం గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెల్సిందే. అయితే ఈ నెల 11న రాజ్ భవన్ నుంచి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదమని తొలుత ప్రకటన రావడంతో సంబరాలను నిర్వహించాలని నిర్ణయించారు. కానీ కొద్దిసేపట్లోనే రాజ్ భవన్ నుంచి ఆ బిల్లు ఆమోదం పొందలేదని రావడంతో కాంగ్రెస్ నాయకులు ఖంగుతిన్నారు. అదే సమయంలో భారీ వర్షం గురించి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో గురువారం నుంచే సభా నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరిలు పర్యటించారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే పీసీసీ ప్రకటన రావడంతో వారు సభా వాయిదా విషయాన్ని ప్రకటించి సొంత జిల్లాలకు పయనమయ్యారు. దానితో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగాల్సిన బీసీ గర్జన సభను కొందరు నాయకులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వస్తుందని దానిపై కన్నేసిన నేతలు బలప్రదర్శనకు సిద్దమయ్యారు. కామారెడ్డి జిల్లా నుంచి కొందరు నేతలు, నిజామాబాద్ జిల్లా నుంచి మరికొందరు నేతలు బీసీ గర్జనను విజయవంతం చేసి నేతల కళ్ళల్లో పడేందుకు ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్ నుంచి మొదలుకుని కామారెడ్డి వరకు హోర్డింగ్ ల ఏర్పాట్లను చేసేశారు. భారీగా ప్రచారం చేసేందుకు ఫ్లెక్సీలను కూడా తయారు చేయించుకున్నట్లు తెలిసింది. తమ నియోజకవర్గాల్లో అనుచరులను పురమాయించి సభ కోసం జనాలను తరలించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ భారీ వర్షం కారణంగా సభ వాయిదా పడడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి.