Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2024, 4:47 pm Posted by : ramakrishna

పోలీసింగ్ పై కల్మేశ్వర్ మార్క్

. సప్పెక్ట్ షీటర్లకు కౌన్సెలింగ్

. మూకుమ్మడిగా సిబ్బంది బదిలీలు

. ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందిపై తనదైన స్టైల్ లో వేటు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ గా వచ్చిన కల్మేశ్వర్ సింగనేవార్ ఏడాది కాలంలో తనదైన శైలిలో శాఖపై పట్టుసాధించారు. అప్పటి సీపీ సత్యనారాయణ గంటల వ్యవధిలోనే బదిలీ కావడంతో హడావుడి వాతావరణంలోనే 2023 అక్టోబర్ 13న రాత్రి 11గంటలకు కల్మేశ్వర్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి నేటి వరకు పోలీసింగ్ పై తన మార్క్ ను ప్రదర్శించారు. ఆయన పేరు చెబితేనే సొంతశాఖతోపాటు ఇతరుల్లోనూ వణుకు వచ్చే పరిస్థితిని తీసుకువచ్చారు. పైరవీ అంటేనే చిర్రెత్తెపోయిన ఆయన.. శాఖలో పైరవీలతో వచ్చిన వారికి  పోస్టింగ్ లు ఇవ్వకుండా దూరం పెట్టారు. ఒక వేళ పోస్టింగ్ ఇచ్చినా వారికి కంటి మీద కునుకులేకుండా చేశారు. పొలిటికల్ లీడర్లతోనూ సై అంటే సై అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ద్వారా పోస్టింగ్ తెచ్చుకున్న అధికారులకు చుక్కలు చూపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ జరగడంతో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపేందుకు రైతులతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు పోలీసుశాఖ అనుమతికోరగా, సీపీ నిరాకరించారు. ఈ విషయంలో భూపతిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి నేరుగా ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లాలో పలు పోస్టింగ్ లను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ద్వారా వచ్చిన విషయం తెలిసి కల్మేశ్వర్ వారికి పోస్టింగ్ లు ఇవ్వకుండా ఇక్కడున్న వారిని రిలీవ్ చేయలేదు. సరిగ్గా నెల రోజుల తరువాత అవే ఉత్తర్వులు రావడంతో పోలీసుశాఖలో అలజడి మొదలైంది. అప్పటి నుంచే కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ అవుతారని చర్చ ప్రారంభమైంది.

శాఖపైనా నిఘా..

గతంలో సెటిల్మెంట్ దందాలకు పాల్పడిన సిబ్బందిపై సీపీ కల్మేశ్వర్ ఓ కన్నేసి ఉంచారు. నిఘా విభాగాలతోపాటు టాస్క్ ఫోర్స్ ను సైతం సీపీ హడలెత్తించారు. పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, రంజాన్, వినాయకచవితి, దసరా నవరాత్రులను శాంతియుత వాతావరణంలో నిర్వహించారు. పోలీస్ శాఖలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేసేందుకు కృషి చేశారు.  అదే సమయంలో శాఖ ప్రక్షాళన దిశగా అడుగులు వేశారు. టాస్క్ ఫోర్స్ ప్రక్షాళనే ఇందుకు ఉదాహరణగా నిలిచింది.

ఇసుక, మొరం మాఫియాపై..

జిల్లాలో తొలుత మోరం, ఇసుక మాఫియాపై నజర్ వేసిన కమిషనర్ 143 మందితో షీట్ తెరిచారు. వారందరినీ పిలిపించి వార్నింగ్ ఇవ్వడంతో పాటు బైండోవర్ చేశారు. వారి తరువాత రౌడీషీటర్లు, కమ్యూనల్ సస్పెక్ట్ లకూ ఇదే విధమైన కౌన్సిలింగ్ ఇచ్చారు. తాజాగా ల్యాండ్ సెటిల్మెంట్ లతో పాటు కబ్జాల కేసులు నమోదైన వారికి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఇదే వ్యవహరం ప్రతిపక్ష బీఆర్ఎస్ తోపాటు అధికార కాంగ్రెస్ నాయకులకు నచ్చడం లేదు. ఇదిలా ఉండగా పోలీస్ స్టేషన్ లలో పాతుకు పోయిన ముదుర్లకు స్థాన చలనం కలిగించారు. 48 గంటల్లో  97 మందిని బదిలీ చేశారు. సీపీ కల్మేశ్వర్ హయాంలో జరిగినన్ని సీఐలు, ఎస్సైలకు మెమోల జారీ, అటాచ్ మెంట్ లు ఇప్పటి వరకు మరే అధికారి హయాంలో జరగకపోవడం గమనార్హం. కమిషనర్ బదిలీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన శాఖ సిబ్బంది, నాయకులు ఇప్పుడు సీపీ బదిలీతో ఊపిరిపీల్చుకున్నారు.