. . . ఆర్ఎస్ పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సమాజంలో అణగారిన వర్గాల కోసం మొదటిసారి విద్య హక్కు కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని ఆర్ఎస్ పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అన్నారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల విద్య, శూద్రుల విద్య, దళితుల విద్య కోసం ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. నేటి పాలకులు పూలే ఆశయాలను విస్మరించి ప్రభుత్వ విద్యను బలహీనపరుస్తూ ప్రైవేటీకరణకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూసివేత, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐపీఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు బొడ అనిల్ మాట్లాడుతూ జ్యోతిబా పూలే కేవలం ఒక సామాజిక సంస్కర్త మాత్రమే కాదు, విద్య ద్వారా సమాజ మార్పు సాధ్యమని నిరూపించిన విప్లవాత్మక నాయకుడని అన్నారు. నేటి విద్యా విధానం పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారిందని, ఫీజుల భారంతో విద్యార్థులు చదువు మానాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పూలే ఆశయాల ప్రకారం ఉచిత, సమాన విద్యను ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్ మాట్లాడుతూ యువత జ్యోతిబ పూలే ఆలోచనలను ఆదర్శంగా తీసుకొని సామాజిక అసమానతల నిర్మూలన కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి అవకాశాల్లో అణగారిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించకపోతే సమాజంలో అసమానతలు మరింత పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్ సింగ్ ఠాగూర్, ముకుందం, వినోద్ గౌడ్, కృష్ణ, సునీల్, సయ్యద్ ఇర్ఫాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.