- ఇందూర్ లో కరెంటోళ్ళకు మరో న్యాయం
- చర్చనీయాంశంగా మారిన ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
నిజామాబాద్ , బతుకమ్మ : లైన్ క్లియర్ (ఎల్ సీ) తీసుకోవడంలో, ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు రావడం ఖాయం. అందుకే విద్యుత్ శాఖలో ఎల్ సీ లేకుండా పనులు చేయరు. చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. కామారెడ్డి జిల్లాలో కాంట్రాక్ట్ లేబర్ కరెంట్ షాక్ గురవ్వడానికి కారణమని ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామ లైన్ మెన్ మన్సూర్, తాండూర్ ఆపరేటర్ రవిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపింది. క్యాజువల్ లేబర్ గా పని చేస్తున్న యాదగిరి ఇద్దరు విద్యుత్ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా కరెంట్ షాక్ కు గురయ్యాడు. అతడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు. విద్యుత్ శాఖాధికారులు అక్కడ నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖపరమైన చర్యల్లో భాగంగా ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నిజామాబాద్ జిల్లాలో మోపాల్ మండలంలో గత నెల 23న నర్సింగ్ పల్లి వద్ద అకాల వర్షానికి తెగిపడ్డ విద్యుత్ తీగలను సరి చేసేందుకు విద్యుత్ శాఖ ప్రైవేట్ కాంట్రాక్టర్ కు పనులు అప్పజెప్పింది. సంబంధిత పనులను చేపట్టిన కాంట్రాక్టర్ తన వద్ద పని చేసే కార్మికులతో పనులు చేపట్టాడు. అయితే అక్కడ ప్రైవేట్ కాంట్రాక్టర్ చేస్తున్న పనులను పర్యవేక్షించాల్సిన లైన్ ఇన్స్ పెక్టార్ గానీ, లైన్ మెన్ గాని లేకుండానే పనులు చేపట్టారు. మొత్తానికి పనులను విద్యుత్ శాఖ స్థానిక ఎఇ పర్యవేక్షణలో ఆ పనులు జరుగాల్సి ఉండగా అవేవి లేకుండానే కాంట్రాక్టర్ పనులు చేపట్టారు. స్థానికంగా కనీసం ఎఎల్ఎం లేకుండా ఎల్ సీ ఇచ్చారని కాంట్రాక్టర్ పనులను చేపట్టాడు. అయితే విద్యుత్ శాఖాధికారులు మాత్రం తమను ఎవరు ఎల్ సీ ఇవ్వలేదని చెబుతుండగా విద్యుత్ సరఫరా జరిగి క్యాజువల్ లేబర్ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత మోపాల్ ఎఈ, లైన్ ఇన్స్ పెక్టర్, స్థానిక లైన్ మెన్, ఎఎల్ఎంలపై విచారణకు విద్యుత్ శాఖాధికారులు ఆదేశించారు. కానీ సంబంధిత రిపోర్టు ఇప్పటి వరకు అధికారులకు చేరకపోగా వారిపై చర్యలు కూడా అటకెక్కాయి.
కామారెడ్డి జిల్లాలో క్యాజువల్ లేబర్ కరెంట్ షాక్ కు గురి కావడానికి కారణమని లైన్ మెన్ తో పాటు సబ్ స్టేషన్ ఆపరేటర్లను అధికారులు ఉన్నఫలంగా సస్పెండ్ చేయగా నిజామాబాద్ జిల్లాలో గత నెల 23న జరిగిన ఎల్ సీ లేకుండా జరిగిన పనులపై, బాధ్యులపై చర్యలకు విద్యుత్ శాఖాధికారులు మీనమేషాలు లెక్కించడం చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి జిల్లాలో క్యాజువల్ లేబర్లకు ఒక న్యాయం, నిజామాబాద్ జిల్లాలో మరో న్యాయమా? అనే చర్చ విద్యుత్ శాఖలో మొదలైంది. అయితే నిజామాబాద్ జిల్లాలో ఒక విధంగా వ్యవహరించడం వెనుక విచారణను అటకెక్కించడం వెనుక పైరవీలు కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా క్యాజువల్ లేబర్ కు పరిహారం ఇప్పించి కేసును నీరుగార్చరనే వాదనలు వినిపిస్తున్నాయి.