Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2024, 12:26 am Posted by : ramakrishna

పని చేయట్లే..  జీతం ఆగట్లే..

  • లైన్ మెన్ పై గ్రామస్తుల ఫిర్యాదు 
  • చర్యలు తీసుకోవడంలో తాత్సరం 
  • ప్రస్తుతం ఊళ్ళో ప్రైవేట్ వ్యక్తి సేవలు 

నిజామాబాద్, బతుకమ్మ :  గ్రామంలో ఉంటూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను పర్యవేక్షించాల్సిన లైన్ మెన్ పని చేయట్లేదు… అలాగని జీతం ఆగట్లేదు…తన ఊరికి విధులకు వెళ్తున్నట్లుగా వెళ్లి ఉపకేంద్రంలో కాసేపు సేద తీరి తిరిగి వెళ్లిపోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. చర్యలు తీసుకువాల్సిన అధికారులే అతనికి వెన్నుదన్నుగా నిలబడుతున్నారు. దీనికి ఫలితంగా పని లేకున్నా జీతం చెల్లిస్తున్నారు. ఇది ఆర్మూర్ డివిజన్ లోని ఇసాపల్లి గ్రామం లైన్ మెన్ వ్యవహారమిది.

గ్రామస్తుల ఫిర్యాదు : రైతులకు, గృహావసరాలకు వినియోగించే విద్యుత్తును నిలిచిపోకుండా చూడాల్సిన లైన్ మెన్ అమ్యామ్యలకు అలవాటుపడ్డాడు. వినియోగదారులపట్ల అమర్యాదగా ప్రవర్తించడంతో విసుగెత్తిన గ్రామస్తులు డివిజన్ స్థాయి అదికారికి ఫిర్యాదు చేసారు. విచారణ జరిపి, చర్యలు తీసుకుంటానని న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వారు వెళ్ళిపోయారు. రోజులు గడుస్తున్నాగాని లైన్ మెన్ పై చర్యలు లేకుండా పోయాయి.  నిర్వాకం శృతి మించడంతో సహించలేని గ్రామ పెద్దలు ఊరిలో అతను పని చేయకూడదని శాసించారు.

ప్రైవేట్ వ్యక్తి సేవలు : కరెంటు పరంగా గ్రామంలో ఎక్కడైనా సమస్యలు నెలకొంటే ప్రైవేట్ వ్యక్తి సేవలు అందిస్తున్నట్లు తెలిసింది. చాలా కాలంగా పని చేస్తుండడంతో తలలో నాలుకల ఉన్నవాడు కావడంతో ఈ వ్యక్తి సేవలనే వినియోగించుకుంటున్నారు. వ్యవసాయం కోసం రైతులు వాడుతున్న విద్యుత్ లో లోపాలు ఎదురైనపుడు ఆ ఊరి వ్యక్తితో పాటు, పక్క గ్రామానికి చెందిన లైన్ మెన్ సేవలు అందిస్తున్నారని తెలిసింది.

ప్రమాదం జరిగితే : విద్యుత్ శాఖ పరంగా నియమించబడిన ఉద్యోగినే గ్రామంలో కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి స్థానంలో ప్రైవేట్ వ్యక్తి విధులు నిర్వహించునపుడు జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు శాఖ నుంచి వినబడుతున్నాయి.

చర్యలు శూన్యం : లైన్ మెన్ ఆగడాలు గ్రామంలో ఎక్కువయ్యాయని, వెంటనే బదిలీ చేయాలని గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. తక్షణమే చర్యలు ఉంటాయని గ్రహించిన గ్రామ ప్రజానీకానికీ అధికారుల నిర్వాకం వల్ల నివ్వెరపోయారు.

లైన్ మెన్ సేవలను గ్రామంలో వినియోగించుకోకూడదని నిర్ణయించుకున్న గ్రామస్థులు రావద్దని అతనికి చెప్పారు. ఇదే అదునుగా అనుకున్న ఆ లైన్ మెన్, ఉపకేంద్రానికి వచ్చి అలా గడిపి వెళ్తున్నారనే అభియోగాలు వినబడుతున్నాయి. ఊరంతా ఒకతాటిపైకి వచ్చి డబ్బులు లేనిదే పని చేయని లైన్ మెన్ గురించి అదికారులకు విశదీకరించి చెప్పినా… చర్యలు తీసుకోవడంలో తాత్సరం చేస్తున్నారు.