Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 May 2025, 5:40 pm Posted by : ramakrishna

జర్నలిస్టుల నిరసన

బతుకమ్మ బోధన్: బోధన్ పట్టణంలో సాక్షి దినపత్రిక చీఫ్ ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసులు దాడులు జరిపిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. శనివారం బోధన్ జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘ నాయకులు మాట్లాడుతూ, ధనుంజయ రెడ్డి పై జరిగిన దాడిని పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్న చర్యగా అభివర్ణించారు. అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీసే పాత్రికేయులపై ప్రభుత్వం కక్ష సాధించడాన్ని తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కులని, వాటిని కాలరాస్తూ పోలీసులతో దాడులు చేయడం తగదని తెలిపారు. ఏపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేలా ప్రవర్తిస్తోందని వారు పేర్కొన్నారు. ఈ నిరసనలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తేల్ల రవి, గంగులు, కృష్ణ, సూర్యప్రకాశ్, తారాచంద్, అనిల్, కుర్షీద్ హసన్, సాయిలు, ఉమాకాంత్, రమేష్, జగన్ రాజేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయుల పట్ల ప్రభుత్వ వ్యవహారం గంభీరంగా పరిగణించాల్సిన విషయం అని, ఇటువంటి చర్యలు పత్రికా స్వేచ్ఛపై దాడిగా మిగిలిపోతాయని స్పష్టం చేశారు.

Journalists' protest