Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 7:02 pm Posted by : ramakrishna

జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

 

. . . టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన ‘ఛలో పార్లమెంట్’ పిలుపు మేరకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఢిల్లీకి చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) నాయకులు, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు మారూఫ్ రజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని పాత్రికేయుల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ జర్నలిస్టులు పార్లమెంట్ సమీపంలో చేపట్టిన ధర్నా అభినందనీయమని పేర్కొన్నారు. ధర్నాలో పాల్గొన్న నాయకులు జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కూడా ఆందోళనకు మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి పాత్రికేయుడి హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ధర్నా అనంతరం జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్ధరణ, రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం అమలు, జర్నలిస్టుల రక్షణ చట్టం రూపొందించడం, నేషనల్ మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై పునఃసమీక్ష చేపట్టడం వంటి ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఉపాధ్యక్షుడు లియాఖత్, సభ్యురాలు మాన్విక మిశ్రా, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు కుంచం శ్రీనివాస్, కుడుతాడి బాపురావు, కె. రమాదేవి, జగదీశ్వర్, పద్మనాభరావు, అలాగే వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

 

Journalists' issues must be resolved immediately.