Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 8:12 pm Posted by : ramakrishna

మృతి చెందిన ఔట్‌సోర్సింగ్ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి

 

. . . బీఎల్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మృతి చెందిన మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ (బీఎల్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లుగా మృతి చెందిన మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికుల కుటుంబాలకు రావాల్సిన ఇన్సూరెన్స్, పీఎఫ్, పెన్షన్ తదితర ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మున్సిపల్ కార్మికుల కుటుంబాలు ఇన్సూరెన్స్, పీఎఫ్, పెన్షన్ కోసం మున్సిపల్ కార్పొరేషన్, పీఎఫ్, ఈఎస్‌ఐ కార్యాలయాల చుట్టూ సంవత్సరాలుగా తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని అన్నారు. దశాబ్దాల పాటు తక్కువ వేతనాలతో సేవలందించిన కార్మికుల కుటుంబాలను నిర్లక్ష్యం చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. మృతి చెందిన ఔట్‌సోర్సింగ్ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. మృతి చెందిన ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన ఇన్సూరెన్స్, పీఎఫ్, పెన్షన్ పెండింగ్ ఫైళ్ల పరిష్కారం కోసం మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. అలాగే మృతి చెందిన, వయోభారం లేదా అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించలేని కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను నియమించేలా కార్పొరేషన్ తీర్మానం చేసి సీడీఎంఏకు పంపాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు రెయిన్‌కోట్లు, యూనిఫాంలు, షూలు, గ్లౌజులు, నాణ్యమైన పనిముట్లు వెంటనే అందించాలని, జీవో నంబర్ 52 ప్రకారం రిజిస్ట్రేషన్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్న కార్మికులకు ఆగస్టు నెల నుంచి గ్రూపుల ద్వారానే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించకపోతే కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, బీఎల్‌టీయూ జిల్లా అధ్యక్షులు కాంబ్లే మధు, జిల్లా గౌరవ అధ్యక్షురాలు సబ్బని లత, బీఎల్‌టీయూ వాటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వినతిపత్రం స్వీకరించిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.