. . . ఘనంగా తెలంగాణ ధూంధాం కళాకారుల బోనాల జాతర
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అర్హులైన ధూంధాం కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ ధూంధాం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్టీసీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లా కళాకారుల ఐక్యతను చాటిచెప్పేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా తెలంగాణ ధూంధాం నిజామాబాద్ జిల్లా కళాకారుల వేదిక ఆధ్వర్యంలో బోనాల జాతరను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. మంగళవారం మాక్లూర్ మండలంలోని ఓట్యాట్‌పల్లి గ్రామంలో ఒడ్డేటవ్వ అమ్మవారికి కళాకారులు బోనాలు సమర్పించారు. అంతకుముందు గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పు దరువులు, శివసత్తుల, పోతరాజుల నృత్యాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. తదనంతరం ఏర్పాటు చేసిన సభలో కళాకారులు తెలంగాణ ఉద్యమ గీతాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆర్టీసీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అష్ట గంగాధర్, కోశాధికారి రాంపూర్ సాయి మాట్లాడుతూ కళాకారుల ఐక్యతకు ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన అన్ని విభాగాల కళాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు వెంటనే కల్పించాలని కోరారు. త్వరలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యక్షురాలు రేలారే రేలా గంగా మాట్లాడుతూ కళాకారుల సంక్షేమం కోసం అమ్మవారి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో బోనం సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలో ఈ తరహా బోనాల జాతర నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో విశేష సేవలందించిన కళాకారుల జీవితాల్లో ఇప్పటికీ ఆశించిన మార్పు రాలేదని, వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కళాకారుల త్యాగాలను గుర్తించి ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు, ఇతర సంక్షేమ పథకాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గంగా, గోదావరి, సాయి లోవోల, సవిత, రాజేందర్, సలహాదారులు పస్కా నర్సయ్య, పాశం కుమార్, బొడ్డెన్న యాదవ్, కోకిల నాగరాజు, సహాయ కార్యదర్శి కర్క రమేష్, క్రాంతి కుమార్, గోరకంటి రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేందర్, ప్రశాంత్ రెడ్డి, మహేష్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చిట్టిబాబు, మాదాసు గోపి, తోగరి నర్సయ్య, చిన్న రాజేందర్, రవి నాయక్, డప్పు సంతోష్, మనోజ్, దివ్య, మానస, స్రవంతి, సమత, లత, శ్వేతతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉద్యమ కళాకారులు పాల్గొన్నారు.
