నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ప్రగతిశీల హమాలీ, మిల్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని గోడౌన్ రోడ్డులో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దాదాపు 3 లక్షలకు పైగా వివిధ రంగాల్లో హమాలీ, మిల్ కార్మికులు ఎగుమతి, దిగుమతులు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ సివిల్ సప్లై (ఎఫ్.సి.ఐ), గ్రానైట్ మార్బుల్, ప్రభుత్వ, ప్రైవేట్ గోదాంలల్లో మార్కెట్, రైల్వే, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్, బజార్ హమాలీ, జట్టు ముఠా, కళాసి, దడవాయి పేరుతో వీరిని పిలుస్తారన్నారు. రైస్ మిల్, ఆయిల్, దాల్, విత్తన శుద్ధి, జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లుల్లో పని చేసే ఆపరేటర్స్ (మేస్త్రీ), హమాలీ, దినసరి, మహిళా కూలీలు, గుమాస్తాలుగా, కార్మికులుగా పనుల్లో కొనసాగుతున్నారన్నారు. అదేవిధంగా ఎగుమతులు, దిగుమతులు చేస్తున్నారు. కానీ వీరికి నేటికి ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు కల్పించకపోవడం అన్యాయమన్నారు. కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు లేక శ్రమ దోపిడికి గురవుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల యొక్క వేతన ఒప్పందాలు, వ్యాపార వర్గాల దయాదాక్షిన్యాలపై ఆధారపడి ఉన్నాయన్నారు. పని భద్రత, హక్కులు లేకపోవడం వల్ల చాలా దయనీయమైన స్థితిలో కార్మికులు జీవిస్తున్నారన్నారు. వీరికి చట్టబద్ధమైన హక్కులు కల్పించాలన్నారు. 2024 అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హమాలీ & మిల్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, దాని ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, నేటి ధరలకు అనుగుణంగా కనీస వేతన జీవోలు సవరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అనేక సభలలో ప్రస్థావించారు. కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, నేటి ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు నిర్ధారించాలన్నారు ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, జిల్లా నాయకులు కిషన్, బి.మురళి, మోహన్, సాయన్న, అశోక్, సుమన్, గంగాధర్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.