Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 6:58 pm Posted by : ramakrishna

బిచ్కుందలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

. . . పార్టీలో చేరిన పలువురు నాయకులు

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలతో పని చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలకు జనసేన పార్టీలో చేరేందుకు స్వాగతం పలుకుతున్నట్లు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో బుధవారం జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మునిసిపల్ కేంద్రం నందు జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వారికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మచ్చ సుధాకర్ పార్టీ కండువాలు కప్పి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తెలంగాణలో జనసేన పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు అందరి సమిష్టి కృషి అవసరమని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం తెలంగాణ జనసైనికుల్లో నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా, స్వచ్ఛమైన రాజకీయాలే ధ్యేయంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చింతల సుభాష్, బాస పవన్, జాదవ్ ఈశ్వర్, గోనె లాలూ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.