Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2025, 2:36 pm Posted by : ramakrishna

మట్టి గణపతికి రాఖీలు కట్టి భక్తిని చాటిన జాగృతి అభ్యుదయ సంఘం హరిత సైన్యం

హైదరాబాద్, బతుకమ్మ : ఈ నెలలో రానున్న వినాయక చతుర్థిని పురస్కరించుకుని జాగృతి అభ్యుదయ సంఘం హరిత సైన్యం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వర్షాకాలం ఆగష్టు నెలలో కూడా రోహిణి కార్తెను తలపించే ఎండలు కాస్తూ చెమటలు పడుతూ, విపరీతమైన ఉక్కపోత వాతావరణాన్ని భరించలేకున్నామని, తమవంతు బాధ్యతగా తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాతావరణ సమతుల్యతకు తామంతా పూనుకుంటామని, ఈ సంవత్సరం వినాయక చవితిని పర్యావరణ ప్రియంగా జరుపుకుంటామని, మన సనాతన హిందూ సంప్రదాయం ఐన మట్టి గణపతిని మా ఇళ్ళలో పూజించుకుంటామని, నిమజ్జనం కూడా మంచినీటి గంగాళంలో సందడిగా జరుపుకుంటామని తమ నిర్ణయాన్ని ప్రకటిస్తూ వినాయకుడి పట్ల వారికున్న అచంచలమైన భక్తిని ప్రదర్శిస్తూ జాగృతి కార్యాలయంలోని పర్యావరణ మట్టి గణపతి విగ్రహానికి రాఖీలు కట్టి లంబోదరునికి జేజేలు పలికారు. వినాయక నవరాత్రులు కూడా ఎటువంటి కాలుష్య కారక వస్తువులు వాడమని, ప్రత్యేకించి ఒక్కసారి వారి పారేసే ప్లాస్టిక్ జెండాలు, అలంకరణ సామగ్రి, సంచులు వాడబోమని, అన్నదానం చేసే క్రమంలో క్యాన్సర్ కారక ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసుల స్ధానంలో శ్రమ అనుకోకుండా తిరిగి వాడుకునే స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడుకుంటామని, విగ్రహాన్ని పసుపు, కుంకుమ, బియ్యం పిండి తదితర సహజ రంగులు, పూలు, పత్రి, పండ్లతోనే అలంకరించుకుని మా జీవితంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడమని గణపతిని మొక్కుతామని అన్నారు. కాలుష్య కారక కలర్ వినాయక విగ్రహమే కావాలని మారాం చేసి తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ప్రకృతి పండుగైన వినాయక చవితిని సంప్రదాయ బద్దంగా జరుపుకుంటామని ముందుకొచ్చిన చిన్నారులను జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ అభినందించారు. ఈ జాగృతి అభ్యుదయ సంఘం హరిత సైన్యాన్ని స్పూర్తిగా చేసుకుని పిల్లలు, పెద్దలందరూ పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని, పోటీలు పడే వినాయక మండపాల నిర్వాహకులు విగ్రహం ఎత్తులో కాకుండా అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, సేవా కార్యక్రమాల్లో పోటీ పడటం వలన మన జల వనరులకు, సమాజానికి మేలు జరుగుతుందని భావన శ్రీనివాస్ తోటి హిందూ భక్తులకు సూచించారు. మారెళ్ళ దుర్గా ప్రసాద్, చెర్రి,  ప్రీతి, క్రితిక, దీక్షిక, గోమయి, పవిత్ర, హర్షిత, విఘ్నేష్, బాలు, మహేష్, రామ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

Jagruti Abhyudaya Sangam Haritha Senayam showed devotion by tying rakhis to the clay Ganesha