Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 4:55 pm Posted by : ramakrishna

జిల్లావ్యాప్తంగా ఏడు చోట్ల జగన్నాథ రథయాత్రలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు కేంద్రం అధ్యక్షులు రామానంద రాయ్ గౌరదాస్ తెలిపారు. బుధవారం కంఠేశ్వర్ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూరి జగన్నాథ క్షేత్రంలో జరిగే రథయాత్రను ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని మహిళలు, పురుషులు, యువత, చిన్నారులు సహా సమస్త భక్తజనులు పెద్ద సంఖ్యలో రథయాత్రల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆయన కోరారు. జగన్నాథ స్వామివారిని రథంపై దర్శించుకోవడం, రథాన్ని లాగడం ద్వారా విశేషమైన పుణ్యం లభిస్తుందని, జన్మజన్మాంతర పాపాలు పరిహారమై భగవంతుని కృపకు పాత్రులవుతారని పురాణాలు పేర్కొంటున్నాయని తెలిపారు. సమస్త లోకాలకు నాయకుడైన జగన్నాథుడి రథయాత్ర జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో నిర్వహించబడటం భక్తులకు అరుదైన ఆధ్యాత్మిక అవకాశమని పేర్కొన్నారు. జూలై 16న ఆర్మూర్‌లో ప్రారంభమయ్యే ఈ రథయాత్ర మహోత్సవాలు జూలై 17న బషీరాబాద్, జూలై 18న ఇందలవాయి, జూలై 19న బోధన్, జూలై 20న నవీపేట్, జూలై 22న నందిపేటలో కొనసాగి, జూలై 24న ఇందూరు నగరంలో నిర్వహించే మహా రథయాత్రతో ముగియనున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి భక్తులు తమకు సమీపంలో నిర్వహించే రథయాత్రల్లో పాల్గొని స్వామివారి రథాన్ని లాగి కార్యక్రమాలను విజయవంతం చేయాలని, తద్వారా శ్రీ జగన్నాథుడి విశేష అనుగ్రహాన్ని పొందాలని రామానంద రాయ్ గౌరదాస్ విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నితాయ్ చంద్ ప్రభు, మాదాసు స్వామి యాదవ్, రఘుపతి, రాధ రాజా గోపికేశ దాస్, బలరాం ప్రభు, సునీల్ ప్రభు, రోహిత్ ప్రభు, నవరూప ముకుంద దాస్ తదితరులు పాల్గొన్నారు.