Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2025, 11:08 pm Posted by : ramakrishna

నిజామాబాద్ లో ఉప ఎన్నికకు వేళాయే..

  • స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత
  • స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా చేసి ఆమోదించాలని చైర్మెన్ ను కోరిన కవిత
  • స్థానిక సంస్థల ఎన్నికల తరువాతనే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉప ఎన్నిక జరుగడం ఖాయమైంది. రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ఆకస్మీక మరణంతో ఉప ఎన్నికకు అధికారులు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారిపై అనర్హత వేటు తో పాటు కోర్టు కేసుల వాయిదా పర్వం కొనసాగుతుంది. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కు ముందే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారనే టాక్ నడస్తుంది. దానితో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతుంది. దానితో ఉమ్మడి జిల్లాలో విస్తరించిన బాన్సువాడ శాసన సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనే టాక్ ఇప్పటికి జోరుగా సాగుతున్న విషయం విదితమే. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి కల్వకుంట్ల కవిత బుధవారం రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనపై జరుగుతున్న పరిణామాలకు తోడు గా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో, ఏకంగా ఎమ్మెల్సీ పదవికి , పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కవిత  ఎమ్మెల్సీ పదవికి కవిత స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేసి ఆమోదించాలని మండలి చైర్మెన్ గుత్తా సుఖేంధర్ రెడ్డిని కోరడంతో రాజీనామా ఆమోదం ఖాయమైంది. దానితో నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగడం ఖాయంగా మారింది.

  • అమ్మో నిజామాబాద్ ఎమ్మెల్సీ పదవా..?

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేయడం జిల్లాతో పాటు రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేపింది. అయితే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి అంటేనే నిజామాబాద్ కొత్త చర్చ జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలోరద్ధు చేయబడిన శాసన మండలిని వైఎస్సార్ పునరుద్ధరించిన నాటినుంచి నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ పదవి వ్యవహారం వివాదాలకు కేరాఫ్ గా ఉప ఎన్నిక రేపు మాపో అనే ప్రచారం జరుగడం ప్రస్తుతం మూడవ సారీ. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగగా అధికార పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికి ఆనాటి టిడిపి అభ్యర్థి అరికేల నర్సారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వేంకట్రామ్ రెడ్డిపై గెలుపొందారు. ఆనాటి ఎమ్మెల్సీ ఫలితాలపై కాంగ్రెస్ అభ్యర్థి కోర్టు మెట్లను ఎక్కడంతో తీర్పు వచ్చే సరికి ఆరుసంవత్సరాల పదవి కాలం కుడా ముగిసింది.  తెలంగాణ వచ్చిన తరువాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ భూపతిరెడ్డి ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తన ఆరు సంవత్సరాల పదవి కాలం ముగియకముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ తో విభేదాలతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆనాడు వచ్చిన ఉప ఎన్నికలలో ఎమ్మెల్సీ కవిత పోటీ చేసి గెలుపొంది 18 నెలల కాలం ఎమ్మెల్సీగా పనిచేశారు. 2023 లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. మరో మూడు సంవత్సరాల పదవి కాలం ఉండగానే కవిత రాజీనామా చేయడంతో అందరు నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం అంటే  అమ్మో అని వెనుకడుగు వేసే పరిస్థితి ఉంది.

  • స్థానిక సంస్థలు, బల్ధియా ఎన్నికల తరువాతనే ఉప ఎన్నిక..?

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామాతో ఉప ఎన్నిక ఖాయమైంది. అయితే ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఓటర్లే లేరు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్ లు,కార్పోరేటర్ల పదవి కాలం ముగిసిపోయి ఏడాది కాలం కావస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వార స్థానిక సంస్థలు ముందుగా తరువాత బల్ధియాల ఎన్నికలకు ప్లాన్ చేస్తోంది. బీసీ రిజర్వేషన్లు, కోర్టు కేసులు కొలిక్కి వస్తే త్వరలోనే ఎన్నికలు నిర్వహణకు కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన దాని ఆమోదం తరువాత ఆరు నెలల కాలంలో ఎప్పుడైనా ఉప ఎన్నిక ప్రకటన వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.