Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 5:03 pm Posted by : ramakrishna

ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత

 

. . . టీపీటీఎఫ్ నిజామాబాద్ అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత, సమాన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని, “కామన్ స్కూల్ విధానం” అమలు చేయాల్సిన అవసరం ఉందని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ అన్నారు. తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 30న హైదరాబాద్ లో ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు సంబందించిన కర పత్రాలు, పోస్టర్ లను నిజామాబాద్ సౌత్ మండల కేంద్రంలో గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమరశీలతత్వాన్ని చాటుకుందాం – విద్యా సమానత్వం సాధిద్దాం అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు. విద్యారంగ సమస్యలతో పాటు సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు నిరంతరం పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యా హక్కుల సాధన కోసం సమగ్ర ఉద్యమాన్ని నిర్మించడమే టిపిటిఎఫ్ లక్ష్యమని తెలిపారు. ఈ రాష్ట్ర విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ కె. నవీన్ నికోల ఐఏఎస్ హాజరుకానున్నారని, గౌరవ అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం పాల్గొననున్నారని తెలిపారు. జాతీయ విద్యా విధానం, సామాజిక న్యాయం పై ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణలో విద్యా అసమానతలపై ప్రొఫెసర్ కాసిం, అంతర్జాతీయ రాజకీయాలపై పూర్వ ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ తదితరులు ప్రసంగించనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పూదారి అరవింద్, గోపి, సాయి, అన్న శ్రీహర్రావు, లక్ష్మీ, రామచంద్ర గైక్వాడ్, సునీత, రాములు, శ్రీ హరి రావు, రాజు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.