Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 6:00 pm Posted by : ramakrishna

ఆదివాసీల హక్కులను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత

 

. . . రాష్ట్ర మంత్రి ధనసూరి అనసూయ సీతక్క

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ఆదివాసీల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం ప్రత్యేక రక్షణలు కల్పించిందని, వాటిని సమర్థవంతంగా అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అశ్వరావుపేటలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీమ్ విగ్రహాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీ ‘జై ఆదివాసీ’ నినాదాలతో మారుమోగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీల చరిత్ర హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటాల చరిత్రేనని అన్నారు. సమ్మక్క-సారక్క, బిర్సా ముండా, రాంజీ గోండు, కొమరం భీమ్ వంటి ఆదివాసీ నాయకులు తమ హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం పోరాడారని ఆమె గుర్తు చేశారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడటం ఇతర వర్గాలకు వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. అన్ని వర్గాలతో సోదరభావంతో కలిసి ముందుకు సాగుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకోవాలని ఆదివాసీ సమాజానికి పిలుపునిచ్చారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధితో పాటు ఇళ్లు, ఉద్యోగాలు, అడవిపై హక్కుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని సీతక్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆదివాసీల భాష, సంస్కృతి, సంప్రదాయాలు, వేషధారణ వారి అస్తిత్వానికి ప్రతీకలని మంత్రి పేర్కొన్నారు. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కొమరం భీమ్ స్ఫూర్తితో ఆదివాసీ సమాజం అభివృద్ధి, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ దిశగా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. వేడుకల అనంతరం మంత్రి సీతక్క అశ్వరావుపేటలోని మహిళా సమాఖ్య భవనాన్ని సందర్శించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులను అభినందించారు.