- డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని ఇది విద్యారంగ తిరోగమన చర్యయని, మరింత విద్యారంగా సంక్షోభానికి దారితీస్తుందని వెంటనే ఈ ఉత్తర్వులను విరమించుకోవాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శంతన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 629 మండలాలు 1, 817 క్లస్టర్ల పరిధిలో ఉన్న 24,146 పాఠశాలలను తనిఖీ చేయడానికి పది సంవత్సరాలు అనుభవం ఉన్న సుమారు రెండువేలకుపైగా ఉపాధ్యాయులకు తనిఖీ బాధ్యతలు అప్పగించి ప్రతి సంవత్సరం, విద్యా సంవత్సరం పొడవునా వారిని తనిఖీ బాధ్యతలలో ఉంచడంవల్ల ,వారు సేవలందిస్తున్న ఆయా పాఠశాలలలో బోధన స్తంభించిపోతుందని ఫలితంగా విద్యా ప్రమాణాలు కుంటు పడతాయని అన్నారు. ఒకవైపు ప్రభుత్వం రాష్ట్రమంతా అన్ని పాఠశాలలో విద్యా ప్రమాణాలకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే ఇలాంటి చర్యలకు పాల్పడడం అనాలోచితమైన చర్యగా పేర్కొన్నారు. కామన్ సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి పూర్తిస్థాయి మండల విద్యాధికారులను, ఉప విద్యాశాఖ అధికారులను, జిల్లా విద్యాశాఖాధికారులను నియమించి పాఠశాలల పర్యవేక్షణ కొనసాగించాలని , తరగతికి ఒక గది, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తూ విద్యా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఇప్పటికే పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ ఖాళీలు ఉండడంవల్ల బోధన స్తంభించిపోతున్నదని వెంటనే డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు.