- రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి
డిచ్‌పల్లి,ధర్పల్లి, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నికలో కార్యకర్తల అభిప్రాయ సేకరణలో భాగంగా డిచ్‌పల్లి,ధర్పల్లి ల లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లలో నిర్వహించిన “సంఘటన్ శ్రీజన్ అభియాన్” సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “ప్రజాస్వామ్య విధానంలో కార్యకర్తల చేతనే జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఎంతో సంతోషకరం. ఇతర పార్టీల్లోలాగా పై అధికారుల నిర్ణయం కాదు, కార్యకర్తలే తామే నాయకుడిని ఎన్నుకోవడం కాంగ్రెస్ ప్రత్యేకత,” అని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి కి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు. అగ్రికల్చర్ కళాశాల నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పడేందుకు తాను వర్షాకాల శాసనసభ సమావేశాల్లో చేసిన కృషి ఫలించిందని చెప్పారు. “42% బీసీ రిజర్వేషన్‌పై కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కానీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది,” అని భూపతి రెడ్డి తెలిపారు. అలాగే త్వరలో నిజామాబాద్ జిల్లాకు వెటర్నరీ కాలేజ్ కూడా కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరనని చెప్పారు. కర్ణాటక ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్ మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీకి కనీసం ఐదు సంవత్సరాలుగా నిష్కళంకంగా సేవలందించిన, ప్రజలతో కలసి పనిచేసే కార్యకర్తకే జిల్లా అధ్యక్ష పదవి దక్కేలా చర్యలు తీసుకుంటాం,” అన్నారు. గ్రామాల వారీగా, మండలాల వారీగా కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి ఏఐసీసీకి పంపిస్తామని తెలిపారు. “సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో ఈ నియామక ప్రక్రియ జరుగుతోంది. బీజేపీ పాలనలో రైతులు, మైనార్టీలు, బలహీన వర్గాలు నష్టపోయారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయాన్ని సాధించాలి,” అని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ అబ్జర్వర్ బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు, మాజీ మేయర్ పరిజతం రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, శేఖర్ గౌడ్, మునిపల్లి సాయి రెడ్డి, నగేష్ రెడ్డి, మారా చంద్రమోహన్ రెడ్డి, వేణు యాదవ్ తో పాటు పలు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
