Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 6:11 pm Posted by : ramakrishna

బాధితుల గోప్యతను కాపాడటం అందరి బాధ్యత

 

. . . నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

లైంగిక నేరాలు, మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసులతో పాటు చట్టపరంగా గోప్యత కల్పించాల్సిన ఇతర కేసుల్లో బాధితుల వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి కేసులకు సంబంధించిన వార్తలను ప్రచురించే సమయంలో బాధితుల పేరు, ఫోటో, వీడియో, ఇంటి చిరునామా, విద్యాసంస్థ, ఉద్యోగ స్థలం, కుటుంబ సభ్యుల వివరాలు, గ్రామం లేదా కాలనీ పేరు, సోషల్ మీడియా ఖాతాల వివరాలు లేదా వారి గుర్తింపును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వెల్లడించే ఎలాంటి సమాచారాన్ని ప్రచురించరాదని స్పష్టం చేశారు. ప్రింట్ మీడియా, న్యూస్ ఛానళ్లు, వెబ్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికలలో బాధితుల గుర్తింపును బయటపెట్టే విధంగా వార్తలు, పోస్టులు, వీడియోలు లేదా చిత్రాలను ప్రచురించడం, ప్రసారం చేయడం లేదా షేర్ చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. భారత సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో)తో పాటు ఇతర సంబంధిత చట్టాల నిబంధనలను ప్రతి మీడియా సంస్థ, జర్నలిస్టు, సోషల్ మీడియా వినియోగదారు తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ సూచించారు. బాధితుల గుర్తింపును బహిర్గతం చేయడం వల్ల వారికి, వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైన మానసిక వేదన, సామాజిక ఇబ్బందులు, భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశముందని పేర్కొన్నారు. అందువల్ల బాధితుల గౌరవం, వ్యక్తిగత గోప్యత, హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థల నిర్వాహకులు, ప్రతినిధులు, కంటెంట్ సృష్టికర్తలు, అలాగే సోషల్ మీడియా వినియోగదారులు బాధితుల గుర్తింపును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వెల్లడించకుండా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. చట్టాలను ఉల్లంఘిస్తూ బాధితుల గుర్తింపును బహిర్గతం చేసినట్లయితే సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకోబడతాయని నిజామాబాద్ పోలీసు శాఖ హెచ్చరించింది.