Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 8:19 pm Posted by : ramakrishna

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

 

. . . ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సమస్యలపై రూరల్ ఎంఈఓ కు వినతిపత్రం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పిడిఎస్ యు నగర కమిటీ ఆధ్వర్యంలో రూరల్ ఎంఈఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు నగర అధ్యక్షుడు ఎండి. నసీర్, కార్యదర్శి ఆల్గోట్ సృజన్ మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేమి, తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ వంటి కనీస సదుపాయాల కొరత వల్ల విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతోందని వారు పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసి, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. అలాగే ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పిడిఎస్ యు నాయకులు సూచించారు. అధిక ఫీజుల వసూళ్లు, పుస్తకాలు, యూనిఫార్ములు, ఇతర వస్తువులను విద్యార్థుల తల్లిదండ్రులపై బలవంతంగా రుద్దే విధానాలను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. విద్యా హక్కు చట్టం (ఆర్ టిఈ)ను సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని వారు కోరారు. విద్యను వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా చూడాల్సిన అవసరం ఉందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు నగర నాయకులు నితిన్, మణితేజ, శ్రీశాంత్ తదితరులు పాల్గొన్నారు.