Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 6:27 pm Posted by : ramakrishna

దొడ్డి కొమురయ్య నగర్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలి

 

. . . సీపీఐఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి దొడ్డి కొమురయ్య నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని సీపీఐఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత డిమాండ్ చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య నగర్ కాలనీలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. కాలనీలో ఉన్న హ్యాండ్ బోర్‌ను మరమ్మతు చేయడం ద్వారా సమస్యకు కొంతవరకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ అంశంపై గతంలో పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ మున్సిపల్ అధికారులు స్పందించలేదని విమర్శించారు. అలాగే కాలనీలో ఇప్పటికీ విద్యుత్ స్తంభాల కొరత కారణంగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో తాత్కాలికంగా తీగలు లాగి వినియోగిస్తున్న పరిస్థితి కొనసాగుతోందని అన్నారు. మరోవైపు మురుగు కాలువలను సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో స్థానికులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మాజిత, నజీమా, సంగీత, ముజీబ్ రబ్బాని తదితరులు పాల్గొన్నారు.