Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 April 2025, 1:30 pm Posted by : ramakrishna

ఇది ప్రజాపాలనా? పోలీసు పాలనా?

. హామీలపై ప్రశ్నిస్తే లాఠీచార్జి చేస్తారా..

. సునీల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన గంటల్లోనే అక్రమ కేసులు

. హామీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం

. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ: ఆడ బిడ్డలు, రైతులకు ఇచ్చిన హామీలపై మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రశ్నిస్తే తమ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారని, తనతోపాటు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి సునీల్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మంత్రిని ప్రశ్నించిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని అనగా, గంటల్లోనే కేసులు నమోదు చేశారని, ఇది ప్రజాపాలనా? పోలీసు పాలనా? అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్ 16 నెలల పాలనను చూస్తుంటే ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో పోలీసుపాలన, రాక్షస పాలన నడుస్తోందని అన్నారు. మూడు రోజుల క్రితం భీమ్ గల్ లో మంత్రి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రజలకు మీరిచ్చే హామీలను అడిగే బాధ్యత ఎమ్మెల్యేగా తనపై ఉందని, ఆడ బిడ్డలకు తులం బంగారం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇస్తారని అన్నారు.

రూ.2500 మహాలక్ష్మిసాయం, పింఛన్ల పెంపు, రూ.2లక్షల రుణ మాఫీ ఏమైందన్నారు. నియోజకవర్గంలో 31 వేల మంది రైతులకు రుణ మాఫీ కాలేదని అన్నారు. ఇప్పటికే రైతుబంధును ఒకసారి ఎగ్గొట్టారని, మార్చి 31లోగా ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. హామీలపై ప్రశ్నించిన తనపైకి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారని, దీనికి అక్కడ ఉన్న 800 మంది ఆడబిడ్డలే సాక్ష్యమని అన్నారు.

Is this public rule? Police rule?

ఫంక్షన్ హాలు బయట కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నా పోలీసులు వారిని వారించలేదని, బీఆర్ఎస్ కార్యకర్తల చేతుల్లో నుంచి ప్లకార్డులను గుంజుకుని పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. ఆ వెంటనే తమ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జి చేయగా, వారికి తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. మేం చేసిన తప్పు హామీలపై ప్రశ్నించడమేనా? అని అన్నారు.

తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మీ కోసమేనని.. రైతులు, ఆడబిడ్డలు ఆలోచించాలని కోరారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన మా కార్యకర్తల ధైర్యాన్ని దెబ్బతీయలేరని, ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.