. బరిలో ఒకే ఒక్కడు పద్మ శ్రీకాంత్
. నూతన చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
ఎల్లారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మున్సిపల్ చైర్మెన్ గా పని చేసిన కుడుముల సత్యనారాయణ పై మెజార్టీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నూతన చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. అధికార యంత్రాంగం ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్ ఎన్నికకు ఇదివరకే నోటిఫికేషన్ ఇవ్వడంతో మూడు నెలల పధవి కాలం కోసం ఎన్నిక జరుగనుంది. ప్రస్తుతం మెజార్టీ సభ్యులు అధికార కాంగ్రెస్ పార్టికి చెందిన వారే ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇప్పటికే మున్సిపల్ పీఠంపై కన్నేసిన 10వ వార్డు కౌన్సిలర్ పద్మశ్రీకాంత్ ఒక్కరే పోటీలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే క్యాంపు రాజకీయాలు కుడా జరగగగా, ఎమ్మెల్యేమదన్ మోహన్ ఎవరి పేరును ప్రతిపాదిస్తే వారే మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కానున్నారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఏర్పడిన విషయం తెలిసిందే. 2019 బల్దియా ఎన్నికల్లో 12 వార్డులున్న ఎల్లారెడ్డి మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకుంది. మెజార్టీ సభ్యుల అండతో ఆ నాడు సత్యం చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2023లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మెన్ గా ఉన్న సత్యనారాయణ కాంగ్రెస్ లో చేరారు. కానీ మెజార్టి సభ్యులు బీఆర్ఎస్ వారు ఉండటంతో వారు అవిశ్వాసం ప్రకటించి ఓటింగ్ ద్వారా సత్యంను పదవి నుంచి తప్పించారు. ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు కాంగ్రెస్ లో చేరడంతో అధికార పార్టి అండ ఉన్నవారే బల్దియా గద్దెనెక్కడం ఖాయమైంది. ప్రస్తుతానికి పద్మశ్రీకాంత్ ఒక్కరే ఎల్లారెడ్డి బల్ధియా పీఠాన్ని ఆశిస్తుండటం, పోటీ లేకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అని చెప్పాలి. గురువారం నిర్వహించనున్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, కమిషనర్ శ్రీహరీ రాజ్ లు ఏర్పాట్లు చేశారు.