- జడ్పీటీసీ అభ్యర్థుల వేటలో డీసీసీ
- బీసీ మహిళా అభ్యర్థిత్వం కోసం ఇందూర్ లో
- ఓపెన్ కేటగిరిలో కామారెడ్డిలో పోటీ
నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు తీవ్ర కసరత్తు చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడే పార్టీని బలోపేతం చేయడంతో పాటు గెలుపు గుర్రాలను స్థానిక సంస్థల్లో అధిక సీట్లను గెలుచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థుల వేటను ప్రారంభించింది. ప్రధానంగా ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ ఉండగా అంతకుముందు రోజు 8న హైకోర్టు తీర్పు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎన్నికలు జరుగడం ఖాయమైనప్పటికీ ఆలస్యమైతే కూడా ముందుగానే అభ్యర్థుల వేటకు సిద్దమైంది. ఎందుకంటే అధికార పార్టీగా ఉమ్మడి జిల్లాలో ఐదు స్థానాల్లో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మంత్రి పదవి లేకపోవడంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇలాకాలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండడం చాపకింద నీరులా బీఆర్ఎస్ పోటీకి సిద్దమౌతున్న నేపథ్యలో గెలుపు గుర్రాల వేటలో కాంగ్రెస్ పార్టీ పడింది.
నిజామాబాద్ జిల్లా జడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వు కాగా, కామారెడ్డి జిల్లా ఓపెన్ కేటగిరి ఉండడంతో గెలుపు గుర్రాలనే బరిలో దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా డీసీసీలకు జిల్లాలోని జడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను కోరింది. జిల్లా పరిషత్ ఫ్రాదేశీక నియోజకవర్గంలోని పోటీ చేసే ముగ్గురు అభ్యర్థుల పేర్లను పంపాలని కోరింది. ఈ నెల 5 వరకు గడువు ఇవ్వడంతో నిజామాబాద్ జిల్లాలో 31 జడ్పీటీసీ స్థానాలు, కామారెడ్డిలో 25 స్థానాల్లో అభ్యర్థుల వేటను ప్రారంభించింది. జిల్లా పరిషత్ స్థానాన్ని గెలువాలంటే ముందుగా చైర్మన్ అభ్యర్థులు ఖరారు కావాలి. కానీ కాంగ్రెస్ లో ఎప్పుడు కూడా ముందస్తుగా చైర్మన్ అభ్యర్థులను, చైర్ పర్సన్ లను ఎంపిక చేయరు. గెలిచిన తర్వాతనే పీసీసీ జడ్పీ పీఠాధిపతులను ఖరారు చేస్తోంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రకారం ఎవరిని బరిలో దించితే వారు గెలువడమే కాకుండా పీఠాన్ని గెలుచుకు వస్తారనే కోణంలో అభ్యర్థుల వేట సాగుతుంది. అంగబలం, అర్ధబలంతో పాటు చరిష్మా ఉన్న నాయకులను ఎంపిక చేసే పనిలో పడింది డీసీసీలు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ పీఠంపై తాజామాజీ ఎమ్మెల్యేలే కన్నువేయడం విశేషం. అయితే జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో తాజామాజీ ఎమ్మెల్యేలు ఉండడం విశేషం. నిజామాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత జడ్పీ చైర్ పర్సన్ స్థానాన్ని ఆశిస్తున్నారు. తెలంగాణ మైనింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కూడా తన సతీమణికి జడ్పీ పీఠం కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా ఓపెన్ కేటగిరి ఉండడంతో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎనుగు రవీంధర్ రెడ్డి ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. వారితో పాటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు సురేందర్ రెడ్డి కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ ఫండ్ ఇవ్వకుండానే అభ్యర్థులను గెలిపించేందుకు గెలిచే గుర్రాలనే టికెట్ ఇవ్వాలని యోచిస్తుందని ప్రచారం జరుగుతుంది. పేరుకు జడ్పీ చైర్మన్ అయినప్పటికీ జిల్లాలో ప్రథమ పౌరుడు(పౌరురాలు) కావడం, క్యాబినెట్ ర్యాంక్ తో పాటు ఐదు సంవత్సరాల అధికారం ఉంటుందని జడ్పీ చైర్మన్ పీఠం కోసం అంగబలం, అర్థబలం ఉన్న నేతలు ఖర్చుకు సై అంటున్నట్లు తెలిసింది. ఈ నెల 5న పీసీసీకి డీసీసీల ద్వారా వెళ్లే జడ్పీటీసీ అభ్యర్థుల జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోనని నేతలు ఆందోళన చెందుతున్నారు. కొందరు పార్టీలు మారిన వారు జడ్పీ పీఠాలను ఆశ్రయిస్తుండగా కాంగ్రెస్ పార్టీ వారికి అవకాశం ఇస్తుందా లేదా అనే చర్చ జరుగుతుంది.