- బోగస్ నివేదిక ఆధారంగా కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ ప్రజలు తిరగబడతారు
- కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ఎండగడ తాం
- ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాంగ్రెస్ అవినీతి బయోపిక్ లా ఉంది
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపరభగీరథుడు కేసీఆర్ కు కారాగారమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళ వారం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ పై కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహలు తొలగించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను బీ ఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా స్థాయి నుంచి నగర, పట్టణ, మండల స్థాయిలో నాయకులు తిలకించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ లు సృష్టించిన అపోహలను పటాపంచలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పూర్తి అవగాహన కల్పించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ ఇచ్చిన బోగస్ నివేదిక ఆధారంగా కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ ప్రజలు తిరగబడుతారని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలు, ఎలాగైనా ఆయనను అరెస్టు చేసి జైలులో పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుటిల కుతంత్రాలకు ఫుల్ స్టాఫ్ పెట్టకపోతే తెలంగాణ చరిత్ర తిరగరాసేలా మరో మహా సంగ్రామానికి తెరదీస్తామని జీవన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ఎదుర్కోవడానికి ప్రజలతో కలిసి మహాయుద్ధం చేయడానికి గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన మలి విడత ఉద్యమం తొలి రోజు నుంచి కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన గులాబీ ఖిల్లా నిజామాబాద్ జిల్లా నుంచే మళ్ళీ కాంగ్రెస్ అకృత్య పాలనపై సమరశంఖం పూరిస్తామని జీవన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సమాజమంతా ఏకమై కాంగ్రెస్ కుటిల కోటలు బద్దలు కొడతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ఎండగడ తామన్నారు. ఇదిలాఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కాంగ్రెస్ అవినీతి బయోపిక్ లా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రిపోర్ట్ నిరాధార అవినీతి ,బూతులు, అబద్దాల తో వండివార్చిన కాంగ్రెస్ వంటకమని ఆయన వ్యాఖ్యానించారు. అది నుంచి తెలంగాణ విలన్ పాత్ర పోషించిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

తడారి ఎడారిగా మారిన తెలంగాణ భూములు పచ్చ బారెలా చేసిన కాళేశ్వరం జలధారలు చూసి కాంగ్రెస్ నాయకుల కండ్లు ఎర్రబారుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడటం ఓర్వలేని ద్రోహులం తా ఒక్కటై కేసీఆర్ పై కక్ష గట్టారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చి దశాబ్దాల కల నెరవేర్చడమే కాక అద్భుతమైన పాలనతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నీలాపనిందలు వేసి విచారణల పేరుతో వేధిస్తూ అవమానాలకు గురిచేయడం దారుణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన చూస్తుంటే అలనాడు భద్రాచలంలో రామందిరం నిర్మించిన రామదాసును జైల్లో పెట్టినట్లు తెలంగాణ ప్రజల కొంగు బంగారం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ ను కూడా జైలులో పెట్టాలని కుట్ర చేస్తున్నట్లుందని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఆధునిక దేవాలయమని, కాళేశ్వరం దేశానికే అన్నం పెట్టే మహాజలశక్తి పీఠమని ఆయన అభివర్ణించారు. తెలంగాణలో కరువుకాటకాలకు, ప్రజల కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం నీళ్లు అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నాశనం కోరుకునే వంకరబుద్ధి గాళ్లకు ఈర్ష్య అసూయ పుట్టించే విధంగా జలాభిషేకం చేసిన వరప్రదాయిని కాళేశ్వరంపై విషం కక్కుతున్నారని ఆయన విమర్శించారు. గోదావరిలో తెలంగాణ వాటాగా దక్కే ప్రతి నీటి చుక్కని ఒడిసిపట్టే కేసీఆర్ ఆలోచన ఫలితమే కాళేశ్వరం అద్భుతమైన జలదృశ్యమన్నారు. పాతాళం నుంచి భూమికి నీటిని రప్పించింది నాటి భగీరధుడు కాగా ఆకాశం నుంచి భూమికి నీటిని ఏటికి ఎదురు నడిపించిన అభినవ అపర భగీరధుడు కేసీఆర్ అని ఆయన అభివర్ణించారు. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అంటారని, కానీ అందుకు విరుద్ధంగా కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ చేసి శిథిల శివాలయంలా మారిన శ్రీరామ్ సాగర్ కు పునరు జ్జీవమిచ్చిన జలప్రధాత కేసీఆర్ అని ఆయన అన్నారు. నీరు లేక నోరు తెరిచిన నిజాంసాగర్ ను కాళేశ్వరం ద్వారా నిండుకుండలా మార్చిన చరిత్ర కేసీఆర్ దన్నారు. సమైక్య పాలనలో నెత్తురు పారిన తెలంగాణ నేలపై కాళేశ్వరం సజీవ జలధార ద్వారా నీటిని పరిచయం చేసిన భగీరథుడు కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. మండుటెండల్లో కూడా చెరువులను మత్తళ్లు దూకించిన మహనీయుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రైతును రాజుగా నిలబెట్టిన మనసున్న మారాజు కేసీఆర్ అన్నారు . అలాంటి మహానేత పై తెలంగాణ ద్రోహులు కక్ష గట్టి వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరాన్ని పండబెట్టి, తెలంగాణ ను ఎండబెట్టి గోదావరి నీరు బనకచర్లకు చేరేలా కాంగ్రెస్ కంకణం కట్టుకుందని ఆయన ఆరోపించారు. తెలంగాణను సర్వనాశనం చేసి చంద్రబాబుకు గురుదక్షిణం చెల్లించుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుతంత్రాలు చేస్తున్నారని, ఇందుకు అడ్డంగా ఉన్న కేసీఆర్ ను అడ్డు తొలగించుకునే కుట్రలో భాగమే కాళేశ్వరం కమీషన్ అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్,గుప్తా బాజిరెడ్డి గోవర్ధన్ మరియు మాజీ జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రభాకర్,సత్య ప్రకాష్, సుజిత్ సింగ్ ఠాగూర్, బాజిరెడ్డి జగన్, పోల సుధాకర్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, నందిపేట్ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
